కామారెడ్డి టౌన్ : అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఆర్‌కే విద్యా సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్రీడల ప్రాముఖ్యత, శారీరక దృఢత్వంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా ఆర్‌కే విద్యా సంస్థల సీఈవో, ఒలింపిక్ రన్ చైర్మన్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి యువత చెడు అలవాట్ల బారిన పడకుండా ఉండటానికి ఆటలు, వ్యాయామం ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, నిరంతర ఉత్సాహం లభిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో శారీరక శ్రమకు కొంత సమయం కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఒలింపిక్ కమిటీ సభ్యుడు సందీప్ గౌడ్, ప్రతినిధులు దత్తాత్రి, నవీన్, నరేశ్, శివ, తదితరులు పాల్గొన్నారు.


