భారీగా దరఖాస్తులు..
నాణ్యమైన విద్య అందిస్తున్నాం..
● బాలికలకు వసతితో కూడిన విద్యాబోధన
● జేఈఈ, నీట్, క్లాట్ కోసం శిక్షణ..
● ప్రవేశాల కోసం పెరిగిన పోటీ
● సీట్ల భర్తీ కోసం ఎంట్రెన్స్ టెస్ట్
నిజాంసాగర్: బాలికల్లో అక్షరాస్యత శాతం పెంపుతో పాటు తల్లిదండ్రులు లేనివారు, బడిబయటి బాలికలకు ఆశ్రయం కల్పించి విద్యనందించేందుకు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఏర్పాటు చేశారు. వసతితోకూడిన విద్య అందిస్తున్నారు. దీంతోపాటు ఈ ఏడాదినుంచి జేఈఈ, నీట్, క్లాట్ కోసం శిక్షణ ఇవ్వనున్నారు. ప్రయివేటుకు దీటుగా నాణ్యమైన విద్య అందుతుండడంతో ఈ విద్యాలయాలలో చేరేందుకు పోటీ పెరుగుతోంది.
19 కేజీబీవీలు..
జిల్లాలో 19 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో ఆరో తరగతి నుంచి పదోతరగతి వరకు బాలికలకు వసతితో కూడిన విద్యను అందిస్తున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తుండడం, చక్కటి విద్య అందుతుండడంతో ఈ పాఠశాలల్లో అడ్మిషన్లకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఇందులో అనాథ బాలికలు, డ్రాపౌట్స్‌తోపాటు పేద తల్లిదండ్రులు తమ కూతుళ్లను చేర్పిస్తున్నారు. ఒక్కో తరగతిలో 40 సీట్లుంటాయి. ఆరోతరగతిలో ప్రవేశాలకోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. మొత్తం 760 సీట్లకు గాను 1,098 దరఖాస్తులు వచ్చాయి. పోటీ ఎక్కువగా ఉండడంతో ప్రవేశ పరీక్ష నిర్వహించి, విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు.
13 కళాశాలలు..
జిల్లాలోని భిక్కనూరు, బీబీపేట, దోమకొండ, రాజంపేట, గాంధారి, లింగంపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, పిట్లం, జుక్కల్, బిచ్కుంద, బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లోని కేజీబీవీలను ఇంటర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశారు. ఆయా కస్తూర్బాల్లో సీఈసీ, బైపీసీ, ఎంపీసీ, ఎంపీహెచ్ డబ్ల్యూ వంటి గ్రూపులున్నాయి. పలు గ్రూపుల్లో అడ్మిషన్లకోసం భారీగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయా కస్తూర్బాల్లో ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి విద్యార్థినులు పోటీపడుతున్నారు. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ప్రవేశానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులకు ఎస్సెస్సీ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు.
పోటీ పరీక్షలకు..
కేజీబీవీ విద్యార్థినులకు ఈ ఏడాదినుంచి జేఈఈ, నీట్, క్లాట్‌ల కోసం కోచింగ్ ఇవ్వనున్నారు. నిజాంసాగర్ కస్తూర్బాలో క్లాట్ శిక్షణ, భిక్కనూరు కస్తూర్బాలో జేఈఈ, లింగంపేట కస్తూర్బాలో నీట్‌కు శిక్షణ ఇస్తారు. దీంతో ఆయా కళాశాలల్లో ప్రవేశాలకు పోటీ ఎక్కువగా ఉంది.
నిజాంసాగర్ కేజీబీవీలో ప్రవేశాలకు ఏటేటా డిమాండ్ పెరుగుతోంది. ఈసారి ఆరో తరగతిలో ప్రవేశానికి 98 మంది దరఖాస్తు చేసుకున్నారు. అనాథ పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇస్తాం. మిగతా సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించాం. త్వరలో భర్తీ చేస్తాం.
– సరోజన, ప్రిన్సిపల్, నిజాంసాగర్ కస్తూర్బా
జిల్లాలోని అన్ని కేజీబీవీల్లో కలిపి 6,318 మంది బాలికలు చదువుకుంటున్నారు. వారికి నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యార్థులు ఎస్సెస్సీతో పాటు ఇంటర్‌లోనూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. దీంతో ప్రవేశాలకు పోటీ పెరిగింది.
– సుకన్య, జీఈసీవో, కామారెడ్డి


