కామారెడ్డి టౌన్ : జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా దుంపటి రాజు, కై రా శ్రవణ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి లక్కిరెడ్డి కమలాకర్‌రెడ్డి సోమవారం ప్రకటించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల అధ్యక్షులుగా బాలా గౌడ్, పోతగోనె ప్రసాద్ గౌడ్, నాగరాజు, సంజీవ్ కుమార్ ఎన్నికయ్యారన్నారు.
25న చలో హైదరాబాద్..
ఉపసర్పంచ్‌ల డిమాండ్ల సాధన కోసం ఈనెల 25న ‘హలో ఉప సర్పంచ్ – చలో హైదరాబాద్’ నిర్వహించనున్నట్లు కమలాకర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమ వాల్ పోస్టర్‌లను ఆవిష్కరించి మాట్లాడారు. మహా ధర్నాను విజయవంతం చేయాలని, పార్టీలకు అతీతంగా ఉప సర్పంచ్‌లంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరం నాయకులు, జిల్లాలోని ఆయా మండలాల ఉప సర్పంచ్‌లు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: జిల్లాకేంద్రంలో ఈనెల 25 న నషా ముక్త్ భారత్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 25 ఉదయం 10 గంటలకు కామారెడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. కళాభారతి ఆడిటోరియం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.
కామారెడ్డి అర్బన్: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ, బీఎస్సీ, బీకాం మొదటి సంవత్సరం ప్రవేశానికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్శిటీ కామారెడ్డి స్టడీ సెంటర్ ప్రిన్సిపల్ విజయ్‌కుమార్, సమన్వయకర్త సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌తో సమానమైన కోర్సు పాసైన వారందరు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, సర్టిఫికెట్ల పరిశీలన కోసం కామారెడ్డి స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని సూచించారు.
కామారెడ్డి టౌన్ : నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఈనెల 27, 28 తేదీలలో ఆరు జిల్లాల ప్రొ కబడ్డీ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ పోటీలను మ్యాట్‌లపై, డే అండ్ నైట్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు జిల్లా సీనియర్ కబడ్డీ క్రీడాకారులు తెలిపారు. టోర్నీలో కామారెడ్డితో పాటు సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాల జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని నైపుణ్యాలను వెలికితీసేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
కామారెడ్డి టౌన్ : విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చిన ట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు. సోమ వారం జిల్లాకేంద్రంలో బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరుతో వేలాది సర్కారు బడులను ఎత్తివేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. సర్కారు బడులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో దోపిడీని అరికట్టేందుకు తక్షణమే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఈపీ –2020ని రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ పట్టణ నాయకులు కౌశిక్, అక్షయ్, స్వస్తిక్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.


