కాంగ్రెస్‌లో కుదిరిన సయోధ్య! | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో కుదిరిన సయోధ్య!

Jun 22 2026 1:18 AM | Updated on Jun 22 2026 1:18 AM

కాంగ్రెస్‌లో కుదిరిన సయోధ్య!

కలిసి పనిచేయాలని సూచించిన

క్రమశిక్షణ కమిటీ

చేతులు కలిపిన షబ్బీర్‌ అలీ,

చంద్రశేఖర్‌రెడ్డి

కామారెడ్డి క్రైం: కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు చేపట్టింది. ఇరు వర్గాలను కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చింది. ఇరు వర్గాలు కలిసిపోవడంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, పీసీసీ జనరల్‌ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి వర్గాలున్నాయి. జిల్లా కేంద్రంలోని శ్మశానవాటిక అభివృద్ధి విషయంలో వీరి మధ్య విభేదాలు ముదిరి, రచ్చకెక్కిన విషయం తెలిసిందే. వ్యక్తిగత వ్యవహారాలు, గౌరవం లేకుండా మాట్లాడడం, అవినీతి, అక్రమాల విషయంలో పరస్పర ఆరోపణలు చేసుకుని ఇరు వర్గాలు పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆశ్రయించాయి. ఇటీవల లీక్‌ అయిన ఓ ఆడియో కాల్‌ వ్యవహారంతో పరిస్థితి మరింత ముదిరి, ఇరువర్గాలు ఎస్పీకి ఫిర్యాదులు సమర్పించాయి. ఆరోపణల వ్యవహారంలో షబ్బీర్‌ అలీ, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిలు ఇదివరకే వేర్వేరుగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తమ వాదనలు వినిపించారు.

వివాదం పరిష్కారం!

ఇరువర్గాల మధ్య ఆరోపణలతో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతోందని భావించిన పార్టీ.. నష్ట నివారణకు చర్యలు చేపట్టింది. ఆదివారం హైదరాబాద్‌లో క్రమశిక్షణ కమిటీ సమక్షంలో గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి, ఆయన సతీమణి గడ్డం ఇందుప్రియతో పాటు షబ్బీర్‌ అలీ సమావేశమయ్యారు. వివాదానికి కారణమైన ఆడియో కాల్‌ తదితర అంశాలపై మరోసారి కమిటీ విచారణ జరిపింది. కమిటీ చైర్మన్‌ మల్లు రవి ఇరువర్గాలతో విడివిడిగా సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం షబ్బీర్‌ అలీ, చంద్రశేఖర్‌ రెడ్డి దంపతులతో కలిసి చర్చించి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించారు. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయాలని మల్లు రవి సూచించినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే షబ్బీర్‌ అలీ, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిలు స్వీట్లు పంచుకుని, వివాదాలకు పోకుండా కలిసికట్టుగా పనిచేస్తామని కమిటీకి హామీ ఇచ్చారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదరడంపై పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement