ఖలీల్‌వాడి(నిజామాబాద్ అర్బన్): నీట్ యూజీ– 2026 రీ ఎగ్జామ్ జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్షాకేంద్రాల వద్ద పోలీసులు ఆంక్షలు అమలు చేశారు. బందోబస్తు మధ్య ప్రశ్నపత్రాలు, ఇతర సామగ్రిని పరీక్ష కేంద్రాలకు తరలించారు. జిల్లా కేంద్రంలోని జీజీ కళాశాల సెంటర్‌కు ఆలస్యంగా వచ్చిన నలుగురు విద్యార్థులను పోలీసులు అనుమతించలేదు. అలాగే బోధన్ సెంటర్‌కు వెళ్లాల్సిన మరో అభ్యర్థి పొరపాటున జీజీ కళాశాల సెంటర్‌కు వచ్చాడు. మొత్తం ఐదుగురు అభ్యర్థులు నీట్‌కు దూరమయ్యారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థుల మెడల్లోని చైన్‌లను, ఆడపిల్లల చేతుల గాజులు, కమ్మలను తీసివేసిన తరువాతే అనుమతించారు. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష కొనసాగింది. పరీక్ష అసలు సమయం మూడు గంటలు కాగా, ఈసారి 15 నిమిషాల అదనపు సమయం కేటాయించారు. 3,459 మంది అభ్యర్థులకు గాను 2,994 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరుశాతం 86.56గా నమోదైంది.
గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. బయోమెట్రిక్ హాజరు నమోదులో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కాపీయింగ్, పేపర్ లీక్‌కు అవకాశం లేకుండా పరీక్షా కేంద్రంలోని ఆయా గదుల వద్ద ఏర్పాటు చేసిన జామర్‌లను పరిశీలించారు. ఎన్‌టీఏ నిర్దేశించిన నిబంధనలను తప్పకుండా అమలు చేస్తూ, ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్ష జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. పరీక్ష సమయం ముగిసే వరకు ఎవరూ బయటికి వెళ్లకుండా చూడాలని, ఆన్సర్ షీట్స్, ఎగ్జామ్ మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకునే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
86.56 శాతం మంది
అభ్యర్థుల హాజరు
జీజీ కళాశాల సెంటర్‌కు ఆలస్యంగా
వచ్చిన నలుగురికి అనుమతి నిరాకరణ
వేరే సెంటర్‌కు వెళ్లి పరీక్షకు
దూరమైన మరో విద్యార్థి
కేంద్రాలను తనిఖీ చేసిన
కలెక్టర్ ఇలా త్రిపాఠి


