● భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన
ఇన్‌చార్జీ సీపీ
తెయూ(డిచ్‌పల్లి) : తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రెండు పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నీట్ యూజీ – 2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తెయూ ఆర్ట్స్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాల్లో 960 మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాశారు. డిచ్‌పల్లి సీఐ వినోద్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష గదుల్లోకి అనుమతించారు. కేంద్రాల వద్ద జామర్లు, బగ్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలతోపాటు కేంద్రం లోపల గోడ గడియారాలు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను నిజామాబాద్ ఇన్‌చార్జీ సీపీ రాజేశ్‌చంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్.శుభం ప్రకాశ్, డిచ్‌పల్లి సీఐ వినోద్, ఎస్సై ఎండీ అరిఫ్ తదితరులున్నారు.
పరీక్షకు వస్తున్న విద్యార్థిని


