● యూరియా స్టాక్ లేదని ఆవేశంతో
ఊగిపోయిన రైతులు
● పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు
● రామారెడ్డిలో ఘటన
రామారెడ్డి(ఎల్లారెడ్డి) : యూరియా కొరత రామారెడ్డిలోని రైతు వేదిక వద్ద తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్టాక్ లేదని తెలిసి ఆవేశంతో ఊగిపోయిన రైతులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి నిరసన తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతులకు శుక్రవారం యూరియా బుకింగ్ విధానంపై అవగాహన కల్పించారు. యాప్ వాడటం తెలియని వారు, చిన్న ఫోన్లు ఉన్న వారు రైతు వేదికకు వస్తే, తామే స్వయంగా బుక్ చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో శనివారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో రైతులు రైతు వేదికకు తరలివచ్చారు. అధికారులు బుకింగ్‌కు ప్రయత్నించగా, అప్పటికే కేటాయించిన యూరియా స్టాక్ అంతా అయిపోయింది. దీంతో ఆగ్రహించిన రైతులు.. రెండు రోజులుగా తమను అధికారులే తిప్పించి ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. సహనం కోల్పోయిన కొందరు రైతులు రైతు వేదికలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న రైతులను సముదాయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలాన్ని కామారెడ్డి ఆర్‌డీవో గిరి సందర్శించి రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు.


