● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్ : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక విస్తృత పునర్విమర్శ–2026 (సర్) కార్యక్రమంపై ఓటర్లలో అవగాహన కల్పించేందుకు శనివారం జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 2కే రన్‌ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సంగ్వాన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఎన్నికల ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదు కావడం ఎంతో ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈనెల 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారని తెలిపారు. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకుని, అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, అక్టోబర్ 1న అభ్యంతరాలు, దరఖాస్తుల పరిశీలన అనంతరం ‘తుది ఓటరు జాబితా’ ప్రచురణ ఉంటుందని వివరించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్‌వీ గిరి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి, డీఈవో మల్లికార్జున్, తహసీల్దార్ హిమబిందు, తదితరులు పాల్గొన్నారు.


