తాత్సారంపైనా..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలో అంతిమ కష్టాలు తీర్చేందుకు దారి సుగమమైంది. శ్మశాన వాటిక అభివృద్ధికి ముందుకొచ్చిన ఎస్‌ఆర్ ఫౌండేషన్‌కు మున్సిపాలిటీ అనుమతి లేఖ అందజేసింది.
దింపుడుకళ్లెం దిమ్మె కూడా లేని కామారెడ్డిలోని ప్రధాన శ్మశాన వాటికలో నెలకొన్న కష్టాలపై ఏప్రిల్ 20న ‘సాక్షి’లో ‘అంతిమ కష్టం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. సమస్య తీవ్రతను చూసి ఎందరో చలించిపోయారు. లక్షకుపైగా జనాభా ఉన్న కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైకుంఠధామాల దుస్థితిని చూసి అవాక్కయ్యారు. ఈ కథనం ప్రచురితమైన రోజే జరిగిన మున్సిపల్ సమావేశంలో ఆయా పార్టీల కౌన్సిలర్లు సాక్షి క్లిప్పింగ్‌ను చూపించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి ‘సాక్షి’ కథనాన్ని చదివి చలించిపోయారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం స్థాయిలో శ్మశాన వాటికను తీర్చిదిద్దడానికి ముందుకువచ్చిన ఆయన.. తన ఎస్‌ఆర్ ఫౌండేషన్ ప్రతినిధుల ద్వారా జిల్లా అధికారులకు లేఖను అందించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సుభాష్‌రెడ్డిని కలిసి అభినందించారు. పట్టణంలోని పలు కుల సంఘాల ప్రతినిధులు సమావేశమై ఎస్‌ఆర్ ఫౌండేషన్‌కు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరారు.
శ్మశాన వాటిక అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చినా అనుమతులు ఇవ్వడంతో బల్దియా తాత్సారం చేసింది. దీనిపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. దీంతో పట్టణ ప్రజల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ఈనెల 11 న మున్సిపల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ‘సాక్షి’ కథనానికి స్పందించి ఎస్‌ఆర్ ఫౌండేషన్ ముందుకు రావడాన్ని ఈ సమావేశంలో సభ్యులు అభినందించారు. శ్మశాన వాటిక అభివృద్ధి పనుల కోసం ఎస్‌ఆర్ ఫౌండేషన్‌కు పరిపాలన అనుమతి ఇస్తూ తీర్మానం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్లందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం నేపథ్యంలో అధికారులు శుక్రవారం ఎస్‌ఆర్ ఫౌండేషన్‌కు పరిపాలన అనుమతి లేఖను అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి, కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మంతరావు, ఏఈ వేణుప్రసాద్, ఎస్‌ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు వెంకట్‌గౌడ్, రాజాగౌడ్, వెంకటరాంరెడ్డి, జీవన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, మట్ట శ్రీనివాస్, అశోక్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
‘అంతిమ కష్టం’ తీరే దారిలో..
ఇటీవలే తీర్మానం చేసిన బల్దియా
తాజాగా ఎస్‌ఆర్ ఫౌండేషన్‌కు అనుమతి లేఖ అందజేత


