కామారెడ్డి టౌన్ : జిల్లాలోని కోర్టులలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అథారిటీ సంస్థ చైర్మన్ సీహెచ్‌వీఆర్‌ఆర్ వరప్రసాద్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కోర్టులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్, మోటారు వాహన ప్రమాదాలు, క్లెయిమ్‌లు, బ్యాంకు రుణ వివాదాలు, చెక్ బౌన్స్ తదితర కేసులు, కుటుంబ వివాదాలను కక్షిదారులు పరస్పర అంగీకారంతో ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చన్నారు. దీనికోసం జిల్లా కేంద్రమైన కామారెడ్డితో పాటు బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి కోర్టుల పరిధిలో మొత్తం 8 ప్రత్యేక బెంచీలను ఏర్పాటు చేశామని తెలిపారు.
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి బల్దియాకు సంబంధించి 2026–27 సంవత్సరానికిగాను తైబజార్, మేకల సంతలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ పర్వతాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30న ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన, అధికారుల సమక్షంలో ఈ వేలం పాట ఉంటుందని పేర్కొన్నారు. అర్హుత గల కాంట్రాక్టర్లు ఈ వేలంలో పాల్గొనాలని సూచించారు.
కామారెడ్డి అర్బన్: విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లేవారే దేనిలోనైనా సులభంగా విజయం సాధిస్తారని విశ్రాంత ఐఏఎస్ అధికారి చామర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శిశుమందిర్‌లో చదివి ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారితో పాటు ఒలింపియాడ్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో శ్రీసరస్వతి విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రావు, జిల్లా కార్యదర్శి గీరెడ్డి రాజారెడ్డి, ప్రబంధకారిణి సభ్యులు గంగారెడ్డి, రంజిత్‌మోహన్, ప్రతాప్‌గౌడ్, సభ్యులు అశోక్‌రావు, ఎస్‌ఎన్ చారి, నారాగౌడ్, శ్రీనివాస్, నాగభూషణం, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: రాష్ట్రంలో వీఆర్‌ఏలుగా పనిచేసి రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, చైన్‌మెన్ కేడర్లలో విలీనం అయిన వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ విషయమై రాష్ట్ర రికార్డు అసిస్టెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్టు రవీందర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, సీసీఎల్‌ఏ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
కామారెడ్డి టౌన్ : మున్సిపాలిటీలో పనిచేస్తున్న సానిటేషన్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రీషియన్, ఆఫీస్ స్టాఫ్ డిమాండ్ల పరిష్కారం కోసం వచ్చేనెల 3వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ పర్వతాలుకు సమ్మె నోటీస్ అందజేశారు. తొలగించిన 41 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, 60 ఏళ్లు నిండిన, అనారోగ్యంతో ఉన్న కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో 22న స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద, 26న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే 3వ తేదీనుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు సుధాకర్, చంద్రశేఖర్, రాజ నర్సు, నర్సింగ్, మెహబూబ్, అయాజ్ బేగ్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.


