నకిలీ విత్తు.. రైతన్న చిత్తు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తు.. రైతన్న చిత్తు

Jun 20 2026 10:44 AM | Updated on Jun 20 2026 10:44 AM

నకిలీ విత్తు.. రైతన్న చిత్తు

నష్టపరిహారం కోసం

అన్నదాతల డిమాండ్‌

డీలర్‌ దుకాణం వద్ద ఆందోళన

లింగంపేట: నకిలీ విత్తనాలతో వరి సాగు చేసి మోసపోయిన రైతులు నష్టపరిహారం కోసం ఆందోళన బాటపట్టారు. శుక్రవారం లింగంపేటలో రాస్తారోకో చేశారు. రైతులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పర్మళ్ల గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతులు గత ఖరీఫ్‌ సీజన్‌లో లింగంపేటలోని ఓ సీడ్స్‌ అండ్‌ ఫెస్టిసైడ్‌ దుకాణంలో కిసాన్‌ సీడ్‌(కేఎస్‌–135) రకం వరి విత్తనాలను కొనుగోలు చేశారు. 10 కిలోల బస్తాకు రూ. 650 చెల్లించారు. ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని డీలర్‌ చెప్పడంతో ఈ విత్తనాలు కొన్నారు. వరి పొట్ట దశలో 20 వరకు పిలకలు వచ్చాయి. అయితే అందులో మూడునాలుగు మాత్రమే గెలలు వేశాయి. దీంతో ఆందోళన చెందిన రైతులు విత్తనాలు విక్రయించిన వ్యాపారిని కలిసి సమస్యను వివరించారు. ఎకరాకు 10 నుంచి 13 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే రావడంతో తీవ్రంగా నష్టపోయామని పేర్కొన్నారు. దీంతో ఆయన కంపెనీ వారిని పిలిపించి నష్టపరిహారం అందేలా చూస్తానని చెప్పారు. సదరు వ్యాపారి సీడ్స్‌ పంపిణీ చేసిన కరీంనగర్‌ రాజు అలియాస్‌ నితీష్‌రెడ్డి దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా ఎలాంటి స్పందన రాలేదు. దుకాణం యజమాని పర్మళ్ల గ్రామానికి చెందిన ముగ్గురు రైతులకు లక్ష రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించినట్లు రైతులు చెబుతున్నారు. దీంతో మిగిలినవారు నష్టపరిహారం కోసం శుక్రవారం సదరు వ్యాపారిని కలిశారు. తాను ఎవరికీ పరిహారం ఇవ్వబోనని చెప్పడంతో రైతులు ఆగ్రహించి సర్పంచ్‌ గడ్డం బాబాయి ఆధ్వర్యంలో కేకేవై రోడ్డులో బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎస్సై దీపక్‌కుమార్‌ రైతుల వద్దకు వచ్చి దుకాణం యజమానితో మాట్లాడతామని నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం రైతులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement