అభివృద్ధికి గ్రహణం! | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి గ్రహణం!

Jun 19 2026 1:06 AM | Updated on Jun 19 2026 1:06 AM

అభివృద్ధికి గ్రహణం!

అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ఏదీ?

గతేడాది ఆగస్టులో చెరువు అలుగు పొంగి ప్రవహించడంతో మునిగిన కాలనీలు (ఫైల్‌)

చిన్నచిన్న పట్టణాలు సైతం అభివృద్ధిలో దూసుకుపోతుంటే జిల్లా కేంద్రంగా ఎదిగిన కామారెడ్డి మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. పట్టణంలో ప్రధాన రోడ్లు ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురై ఇరుకుగా మారాయి. కూడళ్ల అభివృద్ధి అటకెక్కింది. మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాలాలు కబ్జాకు గురవడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లపై మురికి నీరు చేరుతోంది. గతేడాది ఆగస్టులో వచ్చిన వరదలు పట్టణాన్ని అతలాకుతలం చేసినా శాశ్వత పరిష్కారానికి ఇప్పటికీ ఎలాంటి అడుగులు పడకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

మాస్టర్‌ ప్లాన్‌ అమలయ్యేదెప్పుడో?

పట్టణంలోని రోడ్లు విస్తరణకు నోచుకోవడం లేదు. సిరిసిల్ల రోడ్డులో పాత బస్టాండ్‌, రామారెడ్డి చౌరస్తాల వద్ద బస్సు ఆగిందంటే వెనక నుంచి వచ్చే వాహనాలు దాటేసి వెళ్లే పరిస్థితి ఉండదు. ఇందిరాచౌక్‌ నుంచి దాదాపు బైపాస్‌రోడ్డు వరకు రోడ్డును విస్తరించాల్సి ఉంది. నిజాంసాగర్‌ రోడ్డు నుంచి విద్యానగర్‌, ఎన్జీవోస్‌ కాలనీ, సీఎస్‌ఐ చౌరస్తా మీదుగా అశోక్‌నగర్‌, రైల్వే గేట్‌, అడ్లూర్‌ రోడ్డు గుండా పాతబస్టాండ్‌ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల రోడ్డు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 80 ఫీట్లు ఉండాలి. కానీ చాలాచోట్ల 30 ఫీట్ల నుంచి 40 ఫీట్లే ఉంది. అడ్లూర్‌ రోడ్డులో బస్సు గానీ లారీ గాని వచ్చిందంటే చాలు ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది. దర్శన్‌ టాకీస్‌ నుంచి శాంతిటాకీస్‌ మీదుగా పాతబస్టాండ్‌కు వెళ్లడం గగనమవుతోంది.

రోడ్లపైనే కూరగాయల విక్రయాలు

పట్టణంలో డెయిలీ మార్కెట్‌ అంతా దళారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం నిధుల సమస్యతో మధ్యలో నిలిచిపోయింది. దీంతో రైతులు సీఎస్‌ఐ గ్రౌండ్‌, రోడ్లపై కూర్చొని కూరగాయలు విక్రయించాల్సి వస్తోంది. మార్కెట్ల విస్తరణ అంశాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. రోడ్లపై కూరగాయలు అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతుంటే.. వారికి సౌకర్యాలు కల్పించని మున్సిపాలిటీ తైబజార్‌ మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఇలా జిల్లా కేంద్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే నేతలు మాత్రం రాజకీయాలే తప్ప అభివృద్ది విషయంలో నోరు మెదపడం లేదు. ఇప్పటికై నా ముఖ్యనేతలు రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధిలో పోటీ పడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

పట్టణంలో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేదు. దీంతో చాలా ప్రాంతాల్లో డ్రెయినేజీ నీరు రోడ్లపైకి వచ్చి చేరుతోంది. పట్టణంలో పూర్తి స్థాయిలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మించేందుకు అవసరమైన నిధులు సమీకరించడంలో ప్రజాప్రతినిధులు, నేతలు విఫలమవుతున్నారు. చిరుజల్లులకే పట్టణంలోని రోడ్లు మురికికూపంగా మారుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గంజ్‌ రోడ్డు ప్రాంతంలో ఇటీవల డ్రెయినేజీ పొంగి దుకాణదారులు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని చాలా ప్రాంతాల్లో డ్రెయినేజీ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జిల్లా కేంద్రంలో నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో అభివృద్ధి కుంటుపడుతోంది. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేక చిరుజల్లులకే రోడ్లు చెరువులను తలపించడం కామన్‌గా మారింది. వాగు ఉప్పొంగితే పలు కాలనీలు నీట మునగాల్సిందే.. ప్రధాన రహదారులు, జంక్షన్ల విస్తరణపైనా పాలకులు దృష్టి సారించడం లేదు. ముఖ్య నేతలు ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారే తప్ప ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

జిల్లాకేంద్రంలో విస్తరణకు

నోచుకోని రోడ్లు, జంక్షన్లు

చిరుజల్లులకే చెరువులను

తలపించే రహదారులు

వాగు పొంగితే మునిగిపోయే కాలనీలు

ఆధిపత్య పోరులో

ప్రజాసంక్షేమం పట్టని నేతలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement