పెద్ద చెరువు అలుగు నీరు ప్రవహించే వాగు దారిపొడవునా ఆక్రమణలకు గురైంది. వాగుకు ఇరువైపులా మట్టిని నింపేసి ఎక్కడికక్కడ కబ్జా చేశారు. వాగు వెడల్పు తగ్గిపోయి చెరువు అలుగుపారినపుడల్లా నీరంతా ఇరువైపులా ఉన్న కాలనీలను చుట్టేస్తోంది. గతేడాది ఆగస్టు నెలాఖరులో వరదలు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. చెరువు అలుగు నుంచి వాగు దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. 60 మీటర్ల నుంచి 80 మీటర్ల వెడల్పు ఉండాల్సిన వాగు చాలాచోట్ల 20 మీటర్ల నుంచి 30 మీటర్లకు కుచించుకుపోయింది. కొన్నిచోట్ల పది మీటర్ల వెడల్పు కూడా లేదు. కాకతీయనగర్, ఎన్జీవోస్ కాలనీ, విద్యానగర్ కాలనీ, దేవునిపల్లి, నిజాంసాగర్ రోడ్డు తదితర ప్రాంతాల మీదుగా కామారెడ్డి పెద్దచెరువులోకి వెళ్లే నాళాలు చాలా వరకు ఉనికే లేకుండాపోయాయి. దీంతో వర్షం కురిసినపుడల్లా ఆయా కాలనీల్లో నీరు రోడ్లమీద నిలిచి ఇళ్లను ముంచేస్తోంది. చిన్న వర్షానికే నిజాంసాగర్ రోడ్డు చెరువును తలపిస్తుంటుంది. అలాగే అశోక్‌నగర్ రోడ్డు, రామారెడ్డి రోడ్ల పరిస్థితీ ఇంతే..


