కామారెడ్డి క్రైౖం: రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటన భిక్కనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం జరిగింది. రైలు పట్టాల మధ్య ఓ మృతదేహం ఉందనే సమాచారం రావడంతో కామారెడ్డి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఒంటిపై నలుపు, తెలుపు రంగుల చెక్స్ షర్టు, బూడిద రంగు ప్యాంటు వేసుకుని ఉన్నాడు. కుడి చేతికి స్టీల్ కడియం, లవ్ గుర్తు పచ్చబొట్టు ఉన్నాయి. మృతుని వయస్సు 30–35 మధ్య ఉంటుందని, ఘటన జరిగిన తీరు బట్టి ఆత్మహత్య చేసుకున్నారని రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఎవరైనా ఆయనను గుర్తుపట్టినా, ఆనవాళ్లు తెలిసినా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
భార్య కాపురానికి రావడం లేదని ..
వర్ని: మోస్రా మండల కేంద్రానికి చెందిన గంగాప్రసాద్ (24) భార్య మమత కాపురానికి రావడం లేదని మనస్తాపంతో గురువారం తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. మమత పుట్టింటికి వెళ్లి గత ఐదు నెలలుగా తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి చెందాడని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గడ్డివాము దగ్ధం
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని సాతెల్లి గ్రామంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించి గడ్డి వాము దగ్ధమైందని స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన జంగిలి బాలయ్యకు చెందిన 1500 గడ్డి మోపుల వాముకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుందన్నారు. మంటలు అంటుకున్న వెంటనే వాటిని ఆర్పే ప్రయత్నం చేశామని, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించామని తెలిపారు. గడ్డి మోపులు పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితుడు బాలయ్య తెలిపారు.


