సదువే రాదు..
బతిమిలాడాల్సి వస్తోంది..
అందరికీ లభిస్తాయి..
యూరియా కోసం ఎల్లారెడ్డిలోని ఫర్టిలైజర్ దుకాణం వద్ద
పడిగాపులు కాస్తున్న రైతులు
● ఈనెల 15న భిక్కనూరు మండలానికి 4 వేల యూరియా బస్తాలు వచ్చాయి. రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకోవడానికి ప్రయత్నించేలోగానే రెండు నిమిషాల్లోనే స్టాక్ మొత్తం అయిపోయింది.
● ఈనెల 16న ఎల్లారెడ్డి మండలానికి 2,682 బస్తాలు వచ్చాయి. మూడు నిమిషాల్లోనే స్టాక్ మొత్తం బుక్ అయ్యింది. నిమిషాల్లోనే స్టాక్ ఖాళీ అవుతుండడంతో చాలా మంది రైతులు నిరాశ చెందుతున్నారు. ఈ పరిస్థితి జిల్లా అంతటా ఉంది.
భిక్కనూరులో రాస్తారోకో
ఎల్లారెడ్డి : రైతులకు యూరియా పంపిణీని సులభతరం చేయడానికి రాష్ట ప్రభుత్వం యూరియా యాప్‌ను తీసుకువచ్చింది. క్యూలైన్లలో రోజుల తరబడి నిల్చోవాల్సిన ఇబ్బందిని తప్పించడంతోపాటు ఇళ్ల వద్ద నుంచే మొబైల్ ద్వారా యూరియా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. దీనిని గతేడాది డిసెంబర్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసింది.
జిల్లాలో వానాకాలం సీజన్‌లో 5.59 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో సుమారు 3.20 లక్షల ఎకరాలలో వరి సాగవుతుందని, ఇందుకోసం 50,079 టన్నుల యూరియా అవసరమని భావించి అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఫర్టిలైజర్ యాప్ బుకింగ్ ద్వారానే రైతులకు యూరియా సరఫరా చేస్తున్నారు. ఎకరా విస్తీర్ణానికి రెండు బస్తాల చొప్పున అందిస్తున్నారు. ఒక దఫా ఎరువు పొందిన రైతులు తిరిగి యూరియా కోసం 15 రోజులు నిరీక్షించాల్సి ఉంటుంది.
జిల్లాలో చాలామంది రైతుల వద్ద స్మార్ట్ ఫోన్ లేదు. దీనికితోడు పలువురు రైతులు నిరక్షరాస్యులు కావడంతో ఎరువులను బుక్ చేసుకోలేకపోతున్నారు. దీంతో వారు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు యూరియా బుక్ చేసుకోవడంపై సరైన అవగాహన లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యాప్ ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసేలోగానే స్టాక్ ఖాళీ అవుతుండడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులకు కూడా యాప్ లాగిన్, ఓటీపీలు, ఆన్‌లైన్ లింకులు, పేమెంట్లు వంటి ప్రక్రియలు అర్థం కావడం లేదు. దీంతో వారు ఇతరులపై లేదా సొసైటీలు, ఫర్టిలైజర్ డీలర్లపై ఆధారపడాల్సి వస్తోంది. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. దీంతో రైతులు యాప్ బుకింగ్ పద్ధతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతిలోనే యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. మత్తమాల సొసైటీ కింద రైతులు మంగళవారం ఆందోళన చేశారు. బుధవారం భిక్కనూరులో రాస్తారోకో నిర్వహించారు.
కౌలు రైతులకు ఇబ్బందులు..
కౌలు రైతుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. యాప్‌లో ఎరువులు బుక్ చేయాలంటే పట్టాదారు పాస్‌బుక్ నంబరుతోపాటు దానికి లింక్ అయిన ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీలు అవసరం ఉంటాయి. చాలా మంది భూ యజమానులు తమ పొలాలను కౌలుకు ఇచ్చి వేరే ప్రాంతాలలో ఉంటున్నారు. కొందరు వేరే దేశాలకు వెళ్లారు. కౌలు రైతుల వద్ద వారి పాస్‌బుక్‌లున్నా దానికి లింక్ ఉన్న ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో యూరియా బుక్ చేసుకోలేకపోతున్నారు.
భిక్కనూరు: యూరియా కోసం భిక్కనూరులో రైతులతో కలిసి బీఆర్‌ఎస్ నేతలు రోడ్డెక్కారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ సీనియర్ నాయకు డు అందె మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీజన్ ప్రారంభంలోనే ఎరువు దొరక్కపోతే పంటల సాగు మధ్యలో పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం సరపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో విష యం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు వచ్చి సముదాయించినా ఆందోళన విరమించలేదు. దీంతో ఏడీఏ అపర్ణ వచ్చి రైతుల తో మాట్లాడారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో రైతులు శాంతించారు. అనంతరం యూరియా అందుబాటులో ఉంచా లని కోరుతూ ఆమెకు వినతి పత్రం అందించా రు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు తున్కి వే ణు, అత్తెల్లి శ్రీనివాస్, భూంరెడ్డి, వెంకట్‌రెడ్డి, బ స్వయ్య, హన్మంత్‌రెడ్డి, దుర్గారెడ్డి, రంజిత్‌వర్మ, భిక్షపతి, తక్కళ్ల రవీందర్‌రెడ్డి, దేవర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
యూరియా బుకింగ్‌కు అవస్థలు
స్మార్ట్‌ఫోన్‌లు లేక ఇబ్బందులు
క్షణాల్లోనే స్టాక్ ఖాళీ అవుతుండడంతో అన్నదాతల్లో నిరాశ
పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని డిమాండ్
మాకు అస్సలు సదువేరాదు. ఈ బుకింగ్లు, ఓటీపీలు ఎలా అర్థం అవుతయి. ఈ యారియా బుకింగ్ కోసం ఆల్ల ఈల్ల కాళ్లు మొక్కాల్సి వస్తున్నది. ఇవన్నీ లేకుండా పాత పద్ధతిలోనే యూరియా సంచులు ఇవ్వాలి. దుకాణానికి పోయి తెచ్చుకుంటం.
–లాల్య, రైతు, అడవిలింగాల
నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు. డబ్బా ఫోనే ఉంది. వాళ్లను వీళ్లను బతిమిలాడి బుక్ చేసుకున్నా.. మూడు సంచులు ఇస్తమని రెండు సంచులే ఇచ్చారు. యూరియా అయిపోయింది మళ్లీ రమ్మంటున్నారు. రెండెకరాలకు రెండు సంచులు ఏం సరిపోతయి.
– బెస్త కాశీరాం, రైతు, కళ్యాణి
యూరియా అవసరం ఇప్పుడే లేదు. అయితే అవసరం ఉన్నప్పుడు దొరకదేమోనని బుక్ చేసుకుంటున్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దు. ఈ సీజన్‌లో జిల్లాకు 50 వేల టన్నులు అవసరం ఉండగా ఇప్పటికే 20 వేల టన్నులు పంపిణీ చేశాం. మరో 30 వేల టన్నుల యూరియా సిద్ధంగా ఉంది. యాప్ ద్వారా ప్రతి రైతుకూ వారి భూ విస్తీర్ణం ప్రకారం ఎరువులు దొరుకుతాయి.
– మోహన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి


