వాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్ : జిల్లాలోని యువతకు మెరుగైన సాంకేతిక విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. తాడ్వాయిలోని ఏటీసీలో అందుబాటులో ఉన్న కోర్సులలో ప్రవేశాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను బుధవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి ఉత్తీర్ణులైనవారు ఈ ఏటీసీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి అర్హులన్నారు. తాడ్వాయి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రస్తుతం ఆరు కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లోగానీ నేరుగాగానీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలు, కోర్సుల పూర్తి వివరాల కోసం తాడ్వాయిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు.


