కామారెడ్డి టౌన్ : హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వచ్చి దారి తప్పిన ఓ వృద్ధురాలిని పట్టణ పోలీసులు సురక్షితంగా ఆమె బంధువుల చెంతకు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందిన సుగుణ (78) బుధవారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో కామారెడ్డిలోని బంధువుల ఇంటికి శుభకార్యం నిమిత్తం వచ్చారు. కొత్త బస్టాండ్‌లో బస్సు దిగిన ఆమెకు ఎటు వెళ్లాలో తెలియక తీవ్ర ఆందోళనతో తికమకపడుతున్నారు. ఆ సమయంలో బస్టాండ్ వద్ద ట్రాఫిక్ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లు భవాని, సరిత వృద్ధురాలిని గమనించి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. పట్టణ సీఐ నరహరి స్పందించి వృద్ధురాలి బంధువుల ఆచూకీ కనుగొనాలని బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు నర్సింలు, అశోక్‌ను ఆదేశించారు. కానిస్టేబుళ్లు పట్టణంలో విచారణ జరిపి, ఆ వృద్ధురాలి బంధువులు కల్కినగర్‌లో నివాసం ఉంటున్న నరసింహచారిగా గుర్తించారు. ఇన్‌స్పెక్టర్ సమక్షంలో వృద్ధురాలిని సురక్షితంగా వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి వృద్ధురాలిని చేరదీసిన మహిళా కానిస్టేబుళ్లు, ఆచూకీ కనిపెట్టిన బ్లూకోల్ట్స్ సిబ్బంది, సీఐ నరహరికి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


