అందని ద్రాక్షే! | - | Sakshi
Sakshi News home page

అందని ద్రాక్షే!

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

కేంద్రం నిబంధనలు సడలిస్తేనే..

పీఎం కిసాన్‌..

ఏడేళ్లుగా కొత్తవారికి

ఎదురుచూపులే..

కటాఫ్‌ తేదీని మార్చాలంటున్న

అన్నదాతలు

ఏటా తగ్గుతున్న లబ్ధిదారుల సంఖ్య

కఠిన నిబంధనలతో జిల్లాలో

పెట్టుబడి సాయానికి దూరమైన

51 వేల మంది రైతులు

ఎల్లారెడ్డి : చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్‌) పథకాన్ని తీసుకువచ్చింది. అర్హులైన వారికి ఏడాదికి మూడు విడతల్లో కలిపి మొత్తం రూ. 6 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఈ పథకానికి 2019 ఫిబ్రవరి 1 వ తేదీ కంటే ముందు పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఉన్న రైతులను అర్హులుగా గుర్తించింది. ఇదే కటాఫ్‌ తేదీ కావడంతో ఆ తర్వాత భూయజమానులుగా మారినవారికి ఈ పథకం ప్రయోజనాలు అందడం లేదు.

అర్హులకే లబ్ధి చేకూర్చేందుకు..

జిల్లాలో పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల సంఖ్య ఏటేటా తగ్గుతూ వస్తోంది. ఈ పథకం విషయమై నిబంధనలను కఠినతరం చేయడం, కొత్త వారికి అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. జిల్లాలో పథకం ప్రారంభించినప్పుడు 1,68,494 మంది రైతులకు పెట్టుబడి సాయం అందింది. ఆ తర్వాత నిబంధనలను కఠినతరం చేయడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. పథకం ప్రారంభంలో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఆధారంగా నమోదు జరిగినా.. కేంద్ర ప్రభుత్వం పథకానికి అర్హుల విషయంలో పలు నిబంధనలు తెచ్చింది. ఈ–కేవైసీ తప్పనిసరి చేసింది. మరోవైపు ఈ పథకం ప్రారంభమై ఏడేళ్లు దాటినా ప్రభుత్వం కటాఫ్‌ తేదీని పెంచనందున కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. దీంతో ప్రస్తుతం ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 1,16,805 కు తగ్గింది. అంటే పథకం ప్రారంభమైననాటినుంచి ఇప్పటివరకు 51,689 మంది ఈ పథకానికి అర్హత కోల్పోయారన్న మాట.

ఎవరు అనర్హులంటే..

సంస్థలు లేదా కంపెనీల పేర్లపై ఉన్న వ్యవసాయ భూముల యజమానులను అనర్హులుగా పేర్కొంది. ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వ్యక్తులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు (గ్రూప్‌–డి లేదా మల్టీ టాస్కింగ్‌ సిబ్బందికి మినహాయింపు), నెలకు రూ. 10 వేల కంటే ఎక్కువ పెన్షన్‌ పొందుతున్న రిటైర్డ్‌ ఉద్యోగులకు ఈ పథకం వర్తించడం లేదు. ప్రస్తుత లేదా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, సీఏ లు, ఆర్కిటెక్ట్‌లు వంటి వృత్తి నిపుణులు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఈ పథకానికి అనర్హులు. ఒక కుటుంబంలో ఎంతమంది పేర్లపై భూ ములు ఉన్నా ఒక్కరికే లబ్ధి చేకూరుతుంది.

కేంద్ర ప్రభుత్వం పీఎం కి సాన్‌ పథకానికి సంబంధించి 2019 ఫిబ్రవరి 1ని కటా ఫ్‌ తేదీగా నిర్ణయించింది. ఆ తర్వాత భూములు కొన్న రై తులకు ఈ పథకం వర్తించ డం లేదు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలిస్తేనే కొత్తవారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

– మోహన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి

పీఎం కిసాన్‌ పథకానికి అర్హత పొందేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన కటాఫ్‌ తేదీ తర్వాత భూములు కొన్న రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదు. అయితే అనువంశికంగా భూములు పొందిన వారు మాత్రం ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. అయితే ఈ భూమిపై గతంలో ఈ పథకం కింద లబ్ధి పొందితేనే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు పెట్టుబడి సాయానికి అర్హులవుతారు.

కఠిన నిబంధనల కారణంగా పీఎం

కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం లబ్ధిదారుల

సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. ఏడేళ్లలో

జిల్లాలో 51 వేల పైచిలుకు రైతులు ఈ

పథకానికి దూరమయ్యారు. మరోవైపు

పథకం ప్రారంభం నుంచి కటాఫ్‌ తేదీ

పెంచకపోవడంతో కొత్త రైతులు

నిరాశ చెందుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement