● మంజీర నదిలో పూడిక,
ముళ్ల చెట్ల తొలగింపునకు నిధులు
● ప్రారంభమైన పనులు
నాగిరెడ్డిపేట: మంజీర నది పరీవాహక ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సుదీర్ఘ సమస్యకు చెక్ పడనుంది. నది ఉధృతంగా ప్రవహించినప్పుడు సమీపంలోని పొలాలు ముంపునకు గురికాకుండా చూసేందుకు ప్రభుత్వం రూ. 2.08 కోట్లు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి.
ఏటా మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరీవాహక ప్రాంతంలోని పంటలు ముంపునకు గురవుతున్నాయి. నదిలో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మట్టిదిబ్బలు, తుమ్మచెట్లు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. నాగిరెడ్డిపేట మండలంలోని గోలిలింగాల, వాడి, చీనూర్, నాగిరెడ్డిపేట, లింగంపల్లి, వెంకంపల్లి, తాండూర్, మాటూర్, మాసాన్‌పల్లి, ఆత్మకూర్ తదితర గ్రామాల రైతులు ఈ సమస్యతో పంటలు నష్టపోతున్నారు. నదిలోని దిబ్బలు, ముళ్ల చెట్లు, పూడికను తొలగించి పంటలను కాపాడాలని రైతులు ఏళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు రైతుల సమస్యపై స్పందించారు. మంజీర పరీవాహక ప్రాంత భూముల ముంపు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఇటీవల రూ. 2.08 కోట్లు మంజూరు చేసింది.
నీరుండడంతో..
ముంపు సమస్య పరిష్కార పనులు నాలుగు రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. మంజీర నదిలో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిన మట్టిదిబ్బలు, ముళ్ల చెట్లు, పూడిక తొలగింపు పనులు చేపట్టారు. నదిలో నీరు ఉండడంతో పనులకు కొంత ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో నదికి ఒకవైపు ఉన్న ఒడ్డు నుంచి మధ్యలో ఉన్న తుమ్మ చెట్ల వరకు అప్రోచ్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. వరదలు వచ్చేలోపు పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.


