చదువులమ్మ ఒడి.. ఈ సర్కారు బడి! | - | Sakshi
Sakshi News home page

చదువులమ్మ ఒడి.. ఈ సర్కారు బడి!

May 7 2026 8:08 AM | Updated on May 7 2026 8:08 AM

చదువులమ్మ ఒడి.. ఈ సర్కారు బడి!

పదో తరగతిలో విద్యార్థులు, ఉత్తీర్ణత వివరాలు..

బీబీపేట టీఎస్‌ఎన్‌ఆర్‌ హైస్కూల్‌లో కార్పొరేట్‌ స్థాయిలో వసతులు

ప్రైవేట్‌కు దీటుగా బోధన

ఏటేటా పెరుగుతున్న ఉత్తీర్ణత

బీబీపేట: మౌలిక వసతులు కల్పించి, ప్రోత్సహిస్తే అద్భుతాలు చేయగలమని సర్కారు పాఠశాలల విద్యార్థులు నిరూపిస్తున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు బీబీపేట విద్యార్థులు.

మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 2021 కి ముందు సరైన వసతులు లేవు. భవనం శిథిలావస్థకు చేరడంతో బిక్కుబిక్కుమంటూ చదువుకోవాల్సిన పరిస్థితులుండేవి. ఈ పాఠశాలను జనగామ గ్రామానికి చెందినప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి తన తల్లిదండ్రులు తిమ్మయ్యగారి సుశీల, నారాయణరెడ్డి జ్ఞాపకార్థం రూ. 6 కోట్లతో అభివృద్ధి చేశారు. నూతన భవనం నిర్మించడంతోపాటు అన్ని వసతులు కల్పించారు. అన్ని హంగులతో పాఠశాల అందుబాటులోకి రావడం, సరిపడా ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రైవేట్‌కు కాకుండా సర్కారు బడికే పంపించాలని నిర్ణయించుకున్నారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సైతం తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి పాఠశాల నిర్వహణకు ఉపయోగిస్తున్నారు.

నాణ్యమైన విద్య..

బీబీపేటలోని టీఎస్‌ఎన్‌ఆర్‌ హైస్కూల్‌లో డిజిటల్‌ విద్య, కంప్యూటర్‌ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేక కోర్సులుగా హోటల్‌ మేనేజ్‌మెంట్‌, అగ్రకల్చర్‌ కోర్సులున్నాయి. కార్పొరేట్‌ స్థాయి వసతులు అందుబాటులో ఉండడంతోపాటు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఏటా పలువురు విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీ సీట్లు పొందుతున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులు 11 మంది ఎన్‌ఎంఎంఎస్‌కు ఎంపికయ్యారు. క్రీడల్లోనూ విద్యార్థులు రాణిస్తున్నారు. పదో తరగతిలో ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతోపాటు ఫలితాలూ మెరుగవుతున్నాయి. సరైన సౌకర్యాలు కల్పిస్తే అన్ని పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు వస్తాయన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య ఉత్తీర్ణులు ఉత్తీర్ణత శాతం

2023–24 131 118 90

2024–25 143 142 99

2025–26 152 152 100

Advertisement
 
Advertisement
Advertisement