రెండో రోజూ కొనసాగిన సమ్మె | - | Sakshi
Sakshi News home page

రెండో రోజూ కొనసాగిన సమ్మె

Apr 24 2026 5:56 AM | Updated on Apr 24 2026 5:56 AM

బస్సులు నడిపాం..

బస్టాండ్‌ ఎదుట కార్మికుల నిరసన

60 శాతం బస్సులు నడిపామంటున్న

ఆర్టీసీ అధికారులు

కామారెడ్డి టౌన్‌ : తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె జిల్లాలో రెండో రోజు కొనసాగింది. గురువారం ఉదయం నుంచే కార్మికులు జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్టాండ్‌ లోపల సమ్మెకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో కార్మికులు బస్టాండ్‌ బయట ఉన్న చెట్టు కింద శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని నిరసనను వ్యక్తం చేశారు. సమ్మె నోటీసు ఇచ్చి 45 రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే తాము విధులను బహిష్కరించి రోడ్డెక్కాల్సి వచ్చిందని కార్మికులు పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్‌లో ఉన్న రెండు పీఆర్సీలను వెంటనే అమలు చేయాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదన్నారు. సమ్మె శిబిరంలో రమేష్‌ అనే కార్మికుడు సొమ్మసిల్లి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వీడీ దాస్‌, వెంకటి గౌడ్‌, రమేష్‌, కృష్ణమూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల భారీ బందోబస్తు

సమ్మె నేపథ్యంలో బస్టాండ్‌ పరిసరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. బస్టాండ్‌లోకి బస్సులు వెళ్లే ప్రధాన మార్గాన్ని బారికేడ్లతో తాత్కాలికంగా మూసివేసి, బస్సులు బయటకు వెళ్లే ఒకేమార్గం గుండా రాకపోకలను క్రమబద్ధీకరించారు.

కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్‌ సిబ్బంది సహాయంతో బస్సులను నడిపించే ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. కామారెడ్డి డిపో నుంచి సుమారు 60 శాతం బస్సులు రోడ్డెక్కాయన్నారు. గురువారం 75 బస్సులు నడిపామని డీఎం దినేశ్‌ తెలిపారు. ఇందులో 42 అద్దె బస్సులు కాగా.. 33 సంస్థకు చెందిన బస్సులన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయితే కండక్టర్‌లు లేకపోవడంతో కొన్ని బస్సుల్లో టికెట్‌లు లేకుండానే పురుషులు కూడా ఉచితంగానే ప్రయాణించారు.

Advertisement
 
Advertisement
Advertisement