కామారెడ్డి రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థినులు, సిబ్బందికి ప్రత్యేక సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు పడటమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 150 మంది విద్యార్థినులు, వైద్య కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ టీమ్ ఎస్సై నరేష్, దేవునిపల్లి ఎస్సై రంజిత్.. సమాజంలో పెరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాల గురించి విపులంగా వివరించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైనట్లయితే ఏమాత్రం భయపడకుండా హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేయాలని తెలిపారు. షీ టీమ్ సభ్యులు కూడా పాల్గొని మహిళా భద్రతకు సంబంధించిన పలు సూచనలు చేశారు. పోస్టర్లను ఆవిష్కరించారు.


