
గురుకులాలపై సమ్మెపోటు
ఎల్లారెడ్డిలోని ఎస్సీ గురుకులంలో కూరగాయలు కోస్తున్న తాత్కాలిక సిబ్బంది
జిల్లాలో వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడిచే 34 గురుకులాల్లో దాదాపు 2,350 మంది విద్యార్థులు చదువుతున్నారు. మెనూ ప్రకారం వారికి భోజనం పెట్టేందుకు అవసరమైన అన్ని వస్తువులను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తుంటారు. నిత్యావసరాలను ముందుగా సరఫరా చేసినా.. కూరగాయలు, పండ్లు, మాంసం, చికెన్, కోడిగుడ్లు దాదాపు అదేరోజు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ఆయా సరుకులు సరఫరా చేసేవారంతా సమ్మెకు వెళ్లడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. చాలా పాఠశాలల్లో నిల్వలు లేక పాఠశాలల నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు వంట ఏజెన్సీలు కూడా సమ్మెబాట పట్టాయి. చాలా స్కూళ్లలో సాధ్యమైనంత వరకు ఏ రోజుకు ఆ రోజు సరఫరా చేస్తుంటారు. కొన్నింటిని నాలుగైదు రోజులకు సరిపడా సరఫరా చేస్తారు. సరుకు సరఫరాదారులంతా సమ్మెబాట పట్టడంతో సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. బుధవారం విద్యార్థులకు మెనూ ప్రకారం మటన్, చికెన్ కర్రీ వండాల్సి ఉంటుంది. అయితే సంబంధిత కాంట్రాక్టర్లు మాంసం, చికెన్ సరఫరా చేయకపోవడంతో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టలేకపోయారు. ఈ విషయంలో కొన్ని స్కూళ్లలో సరఫరాదారులకు నోటీసులు జారీ చేశారు.
కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా..
గురుకులాలకు సంబంధించి వంట సామగ్రి, కూరగాయలు, పండ్లు, మాంసం వంటివి సరఫరా చేయడానికి ప్రభుత్వం కొత్త విధివిధానాలను రూపొందించింది. మండలం/జిల్లా యూనిట్‌గా టెండర్లు ఆహ్వానించింది. వీటిని పొందాలంటే రూ. కోట్లల్లో పెట్టుబడి అవసరం అవుతుంది. దానికి తోడు జీఎస్టీ లైసెన్స్ కలిగి ఉండాలనడం, ఇతర నిబంధనలు పాటించాలంటే ప్రస్తుతం సరఫరా చేస్తున్న వారిలో ఏ ఒక్కరికీ అవకాశం దక్కదు. ప్రస్తుతం సరుకులు సరఫరా చేస్తున్న వారంతా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారు కావడం వల్ల అంత పెద్ద మొత్తంలో పెట్టుబడి సమకూర్చే పరిస్థితి లేదు. దీంతో వారంతా టెండర్లకు దూరం కావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పాత పద్ధతిలోనే సరుకుల టెండర్లు పిలవాలని వారు డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు.
తాత్కాలిక సిబ్బందితో వంట
ఎల్లారెడ్డిరూరల్: గురుకులాలకు సరుకులు సరఫరా చేసేవారితోపాటు వంట చేసేవారు సమ్మె బాట పట్టడంతో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ప్రిన్సిపాల్స్ చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం తాత్కాలిక సిబ్బందితో వంట చేయించారు.
మెనూ అమలు కష్టమే..
గురుకుల పాఠశాలలు, కళాశాలలకు కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్, గుడ్లు, ఇతర సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు సమ్మెబాట పట్టారు. దీంతో బుధవారం నుంచి సరుకుల సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు భోజనం అందించేందుకు ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్ ఇబ్బందిపడుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
సరుకుల కాంట్రాక్టులో కొత్త
నిబంధనలపై సరఫరాదారుల నిరసన
టెండర్లలో పాత పద్ధతినే
కొనసాగించాలని డిమాండ్
జిల్లాలో నిలిచిపోయిన సరుకుల సరఫరా
మాంసం, కూరగాయలు, పండ్లు, ఇతర సామగ్రి సరఫరా నిలిచిపోవడంతో మెనూ అమలు జరగడం కష్టంగా మారింది. మెనూలో రోజుకో రకమైన భోజనం ఉంటుంది. వారంలో రెండు రోజులు మాంసంతో కూడిన భోజనం పెట్టాలి. మాంసం సరఫరా నిలిపివేయడం వల్ల విద్యార్థులకు మాంసాహారంతో కూడిన భోజనం అందే పరిస్థితి లేదు. విద్యార్థులకు సరిపడా మాంసం అప్పటికప్పుడు తీసుకురావడం సాధ్యమయ్యే పనికూడా కాదు. వంట ఏజెన్సీలు కూడా సమ్మెలోకి వెళ్లడంతో విద్యార్థులకు భోజనం అందించడం కష్టసాధ్యంగా మారే అవకాశాలున్నాయి.