కాకినాడలోని
జెడ్పీ కార్యాలయం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ఆఖరి సమావేశం జెడ్పీ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం గత నాలుగేళ్లుగా ఉమ్మడిగానే కొనసాగిన జెడ్పీ ప్రస్తుత పాలకమండలి గడువు సెప్టెంబర్ 10తో ముగుస్తుంది. అక్టోబర్‌లో జెడ్పీ ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ ప్రతిపాదించడం, అంతకుముందే రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఉండటంతో ఈ జెడ్పీని నాలుగు భాగాలుగా విభజించనున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రంపచోడవరం ప్రధాన కేంద్రాలుగా ఈ జిల్లా పరిషత్ విడిపోనుంది. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చరిత్రలో ఒక విశిష్ట స్థానం ఉంది. అప్పట్లో జిల్లా బోర్డు చైర్మన్‌గా మల్లిపూడి పళ్లంరాజు సుదీర్ఘకాలం పనిచేశారు. మరోవైపు స్వాతంత్య్ర సమరంలోనూ పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన ఎస్‌బీవీకే సత్యనారాయణరావు కేంద్ర మంత్రి అయ్యారు. జీఎంసీ బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా ఎదిగారు. వంగా గీత జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేసి రాజ్యసభలో ప్రవేశించారు. బొడ్డు భాస్కర రామారావు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా పనిచేశారు. రాష్ట్ర స్థాయి పదవులు సైతం అలంకరించారు. చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ జెడ్పీ చైర్మన్‌గా పనిచేసి, అనంతరం వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.
జిల్లా బోర్డు నుంచి
జిల్లా పరిషత్‌గా మార్పు
స్వాతంత్య్రం తరువాత దేశంలో స్థానిక స్వపరిపాలనకు కొత్త రూపం ఇవ్వాలనే ఆలోచన బలపడింది. 1959లో జిల్లా పరిషత్ చట్టం రావడంతో దాని ఆధారంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాకూ జెడ్పీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం జిల్లా పరిషత్తులు 1959 డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఏర్పాటయ్యాయి. దీంతో పాత జిల్లా బోర్డు వ్యవస్థకు బదులు మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు పునాది పడింది. గ్రామస్థాయి, సమితి స్థాయి, జిల్లా పరిషత్ స్థాయిగా ఏర్పడిన ఈ వ్యవస్థ అనంతర కాలంలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల రూపంలో మార్పు చెందింది. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ఆవిర్భావం 1959లోనే జరిగింది. 2022 ఏప్రిల్ 4న కొత్త జిల్లాలు అమలులోకి వచ్చాయి. అంతకు ఆరు నెలల ముందే జెడ్పీ ఎన్నికలు జరగడంతో విభజనకు పదవీకాలం ముగిసే వరకు ఆగాల్సి వచ్చింది.
ఇప్పటివరకు
పనిచేసినవారు వీరే...
దివాన్ బహుదూర్ శేషగిరిరావు, మాదిరెడ్డి వెంకటరత్నం నాయుడు, పోకల గోవిందరావు నాయుడు, మల్లిపూడి పళ్లంరాజు, రాజా కాకర్లపూడి రాజగోపాల్ నరసరాజు, మెండు వీరన్న, బలుసు బుచ్చి సర్వారాయుడు, మారిన నరసన్న, తూర్పుగోదావరి జిల్లా బోర్డు సభ్యులుగా పనిచేశారు. జెడ్పీ చైర్మన్లుగా తోట రామస్వామి, ఎస్‌బీపీవీకే సత్యనారాయణ రావు, పంతం పద్మనాభం, బొడ్డు భాస్కర రామారావు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లుగా జీఎంసీ బాలయోగి, గారపాటి గంగాధర్ రామారావు చౌదరి, వంగా గీత, గుత్తుల బుల్లిరాజు, దున్న జనార్దన్‌రావు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, నామన రాంబాబు, జ్యోతుల నవీన్ కుమార్ విధులు నిర్వర్తించారు. 2021 సెప్టెంబర్ 25 నుంచి విప్పర్తి వేణుగోపాలరావు జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.


