రైతుకు తేమ శాపం | - | Sakshi
Sakshi News home page

రైతుకు తేమ శాపం

May 3 2026 7:41 AM | Updated on May 3 2026 7:41 AM

తేమ 17 శాతంలోపు ఉంటేనే ధాన్యం

కొనుగోలు చేస్తున్న మిల్లర్లు

కోతలు కోసి సుమారు

వారం రోజులు ఆరబెట్టాల్సిందే..

జోరుగా వరి కోతలు.. పట్టుబడులు

ఇదే సమయంలో భయపెడుతున్న

చిరుజల్లులు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ప్రకృతి విపత్తులతో ఖరీఫ్‌ తుడిచిపెట్టుకుపోవడం.. రబీలో పంట పండినా ప్రభుత్వం సక్రమంగా కొనుగోలు చేయకపోవడం.. కొనుగోలు చేసినా కనీస మద్దతు ధర దక్కకపోవడం.. కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు చేయకపోవడం.. ఇదంతా కూటమి పాలనలో ఏటా జరుగుతున్న ప్రహసనమే. ప్రస్తుత రబీలోనూ ఇదే జరుగుతోంది. ఒకవైపు అకాలంగా వరుణుడు భయపెడుతూంటే, మరోవైపు సర్కారు వివిధ నిబంధనలతో ఓ ఆటాడుకుంటోంది. ఆరుగాలం శ్రమంచి పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని గొప్పలు చెప్పడం తప్ప క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి చంద్రబాబు సర్కారు ధాన్యం కొనుగోలు చేయడం లేదు.

ప్రస్తుత రబీలో జిల్లావ్యాప్తంగా 1.90 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 1.15 లక్షల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. సామర్లకోట, పిఠాపురం, కరప, కొత్తపల్లి, గొల్లప్రోలు, తుని, శంఖవరంతో పాటు పలు మండలాల్లో ఇప్పటికే కోతలు దాదాపు పూర్తయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని రైతులు రోడ్లు, కళ్లాల్లో ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకూ రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) ద్వారా ప్రభుత్వం 60 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. తేమ శాతం 17 కంటే తక్కువ ఉంటేనే రైతుల నుంచి మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం సాధారణ రకం 75 కేజీల బస్తాకు రూ.1,777 మద్దతు ధర ప్రకటించింది. కానీ, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిప్పటిటి నుంచీ తేమ శాతాన్ని సాకుగా చూపిస్తూ రైస్‌ మిల్లర్లు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీంతో, తమకు ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించి మద్దతు ధర ఇవ్వకుండా బస్తాకు రూ.300 నుంచి రూ.400 వరకూ కోత పెడుతున్నారు. మరోవైపు గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వానికి ధాన్యం అమ్మితే డబ్బులు ఎప్పటికి వస్తాయో తెలియక పలువురు రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారు.

మద్దతు ధర రాక తక్కువకు అమ్మేస్తున్నాం

ఒకవైపు ధాన్యాన్ని వారం పది రోజులు ఆరబెట్టిన తర్వాత తెస్తే మద్దతు ధర ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు వాతావరణంలో మార్పులతో ఎప్పుడు వర్షం కురుస్తుందోనని భయపడాల్సి వస్తోంది. అందుకే, బయటి వ్యక్తులకు బస్తా రూ.1,550కి అమ్ముకున్నాం. తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలి.

– సామన గంగారావు, రైతు,

తిమ్మాపురం, కాకినాడ రూరల్‌ మండలం

Advertisement
 
Advertisement
Advertisement