పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు

Apr 23 2026 7:30 AM | Updated on Apr 23 2026 7:30 AM

అడ్డతీగల: పోక్సో కేసులో నేరారోపణ రుజువు కావడంతో ఓ వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి కె.శ్రీదేవి బుధవారం తీర్పు చెప్పినట్లు అడ్డతీగల సీఐ బి.నరసింహమూర్తి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. అడ్డతీగల మండలం కోవెలపాలేనికి చెందిన చెక్కా బాలురెడ్డి అదే గ్రామానికి చెందిన బాలిక(6)కు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అడ్డతీగల పోలీసులు 2024 జూన్‌ 11న కేసు నమోదు చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తు అనంతరం నిందితుడు బాలురెడ్డిని అరెస్ట్‌ చేశారు. కోర్టులో విచారణ అనంతరం నిందితునిపై నేరారోపణ రుజువు కావడంతో న్యాయమూర్తి శ్రీదేవి బుధవారం అతనికి శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారని సీఐ వెల్లడించారు. అంతేకాకుండా బాధిత బాలికకు రూ.3 లక్షల పరిహారం అందించాలని డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీని న్యాయమూర్తి శ్రీదేవి ఆదేశించారు.

బస్సు ఢీకొని

యువకుడి మృతి

తాళ్లపూడి: ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వేగేశ్వరపురం గ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన రామిశెట్టి పోసిబాబు అనే సందీప్‌ (25), కొంజర్ల సత్తిబాబులు ప్రైవేట్‌ ఎలకీ్‌ట్రషియన్లుగా పని చేస్తున్నారు. వీరు బుధవారం రాత్రి పనులు ముగించుకుని బైక్‌పై తాళ్లపూడి నుంచి భోజనం తెచ్చుకోవడానికి వెళుతున్నారు. అదే సమయంలో రాజమహేంద్రవరం నుంచి పోలవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేంకటేశ్వరస్వామి గుడి సమీపంలో బైక్‌ను ఢీకొంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ బస్సు కింద పడిపోయారు. పోసిబాబు అక్కడికక్కడే మృతి చెందగా, సత్తిబాబు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ సంఘటనా ప్రదేశానికి చేరుకుని వివరాలు సేకరించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..

సామర్లకోట: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. జగ్గంపేట నుంచి పెద్దాపురం వైపు బైక్‌పై వస్తున్న సామర్లకోటకు చెందిన పొట్నూరి గణేష్‌ (37)ను వెనుక నుంచి ధాన్యం లోడ్‌ ట్రాక్టర్‌ మంగళవారం రాత్రి ఢీకొంది. స్థానిక కట్టమూరు సెంటర్‌ దుర్గమ్మ గుడి సమీపంలో రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న గణేష్‌ను స్థానికులు పెద్దాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి అన్నయ్య శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు సీఐ వివరించారు.

ఉలిక్కిపడిన ప్రజలు

ముమ్మిడివరం: వార్షిక తనిఖీల్లో భాగంగా లంకాఫ్‌ ఠానేల్లంకలో ఓఎన్జీసీ అధికారులు పైపులైన్లు తనిఖీ చేస్తుండగా భారీ శబ్దం రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళనకు గురై స్థానికులు ఓఎన్జీసీ సైట్లో బ్లోఅవుట్‌ సంభవించిందని అనుకుని ఆ విషయాన్ని రెవెన్యూ, పోలీస్‌, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులంతా హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిస్థితిని ఆరా తీశారు. అప్పటికే అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓఎన్జీసీ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తనిఖీలు చేస్తున్నట్లు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పనులు నిర్వహించడాన్ని స్థానికులు తప్పుపట్టారు. గ్యాస్‌ లీకేజీపై సోషల్‌ మీడియాలో ప్రచారం జరగడంతో ఆయిల్‌ ఇండియా అధికారులు వివరణ ఇచ్చారు. ఠానేల్లంకలో ప్రతి 9 నెలలకోసారి పరిస్థితులను బట్టి సాధారణ నిర్వహణ (జనరల్‌ చెకప్‌) ప్రక్రియ నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. బుధవారం అదే విధంగా టెస్ట్‌ మెయింటెనెన్స్‌ పనులు చేస్తుండగా, కొంత గ్యాస్‌ విడుదల కావడంతో ప్రమాదకర గ్యాస్‌ లీకేజీగా తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. ఎటువంటి ప్రమాదకర పరిస్థితి లేదని ఓఎన్జీసీ, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ అధికారులు స్పష్టం చేశారు.

ద్విచక్ర వాహనం చోరీ

కాకినాడ లీగల్‌: కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం ఆవరణలో ఉంచిన ద్విచక్ర వాహనం మంగళవారం చోరీకి గురైంది. స్థానిక పాత బస్టాండ్‌ సమీపంలోని వేంకటేశ్వర కాలనీకి చెందిన మల్లాడి ధనేష్‌ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయానికి పని నిమిత్తం వచ్చారు. కార్యాలయ ఆవరణలో తన బైక్‌ను పెట్టి లోపలకు వెళ్లి బయటకు వచ్చేసరికి కనిపించలేదు. దీంతో ధనేష్‌ కాకినాడ వన్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement