పైసల పంచాయితీ! | - | Sakshi
Sakshi News home page

పైసల పంచాయితీ!

Aug 25 2026 12:51 AM | Updated on Aug 25 2026 12:51 AM

గట్టు: గ్రామ పంచాయతీల్లో పెండింగ్‌ బిల్లుల పంచాయితీ నెలకొంది. కొత్త సర్పంచులు, తాజా మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల నడుమ మూడు ముక్కలాటలా ‘పంచాయతీ’ కొనసాగుతోంది. ఇద్దరు కొట్లాడితే.. మూడో వ్యక్తి బాగుపడతాడన్నట్లుగా పాత, కొత్త సర్పంచులు బిల్లుల కోసం పీకులాడుతుండగా.. మధ్యలో పంచాయతీ కార్యదర్శులు (సర్పంచులు) లేని సమయంలో ఊరి కోసం తాము ఎంతో చేశామని.. వాటి బిల్లులు రాబట్టుకున్న తర్వాతే మిగతావనే విధంగా వ్యవహరిస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామ పంచాయతీ ఖాతాల్లో ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులు జమయ్యాయి. జిల్లాలోని 255 పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.14.32 కోట్లు విడుదలయ్యాయి. ఆ నిధులను ఎందుకోసం డ్రా చేసుకుంటున్నారనే విషయాలు తెలియక కొత్త సర్పంచులు తలలు పట్టుకుంటున్నారు. కొత్త సర్పంచులను కొందరు కార్యదర్శులు ఖాతరు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీ ఖాతాల్లో జమ చేసిన నిధులను గుట్టుగా తమ హయాం (ప్రత్యేకాధికారుల పాలన)లో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు పొందేందుకు కార్యదర్శులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే గ్రామ సభలో చర్చించకుండానే పాత బిల్లులు అంటూ డ్రా చేసుకోవడం వివాదాలకు కారణమైంది.

పాత సర్పంచుల విలవిల..

గ్రామ పంచాయతీల్లో పాత సర్పంచులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కొందరు అప్పులు చేసి మరీ పనులు చేయగా.. బిల్లులు రాకపోవడంతో అప్పులకు వడ్డీలు కట్టలేక విలవిలలాడుతున్నారు. పాత బకాయిల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. 2024 ఫిబ్రవరి నుంచి 2025 డిసెంబర్‌ వరకు రెండేళ్లపాటు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగించారు. 2026 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో కొత్త సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. అయితే పాత సర్పంచుల బకాయిల సంగతిని పక్కన పెట్టిన కొందరు పంచాయతీ కార్యదర్శులు.. ప్రత్యేక పనుల పేరిట 15వ ఆర్థిక సంఘం నిధులను డ్రా చేసుకుంటున్నారు. గట్టు మండలంలోని ఓ పంచాయతీలో మాజీ సర్పంచ్‌ ఏ పనులు చేయకుండా, ఎలాంటి ఎంబీ రికార్డు లేకుండానే పంచాయతీ కార్యదర్శిపై ఒత్తిడి తీసుకొచ్చి రూ.2 లక్షల చెక్కు రాయించుకున్నట్లు తెలిసింది. కొత్త సర్పంచులు వచ్చే నాటికే పంచాయతీలో ఆ పనులు చేయించాం.. ఈ పనులు చేయించామంటూ పంచాయతీ కార్యదర్శులు సుమారు రూ.50 వేల నుంచి రూ.3 లక్షల బిల్లులు డ్రా చేసినట్లు సమాచారం.

వివాదాలు సృష్టిస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధుల డ్రా

సర్పంచులు లేని సమయంలో

చేసిన పనులకు బిల్లులు

అయోమయంలో కొత్త సర్పంచులు

బకాయి బిల్లుల కోసం పాత సర్పంచుల పాట్లు

నేడు గట్టు పంచాయతీలో జిల్లా అధికారులు విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement