సారుసారుకో కొత్త కారు..! | - | Sakshi
Sakshi News home page

సారుసారుకో కొత్త కారు..!

Aug 25 2026 12:51 AM | Updated on Aug 25 2026 12:51 AM

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లో విద్యార్థుల భవిష్యత్‌ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దశాబ్దాలు గడిచినా నిధుల లేమితో అల్లాడుతున్న ఈ విశ్వవిద్యాలయం.. ఇప్పుడిప్పుడే వనరులు సమకూర్చుకుంటూ ఎదిగే ప్రయత్నం చేస్తోంది. అయితే నిధులు లేవనే సాకుతో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతోపాటు కనీస వసతులు కల్పించకుండా పక్కనబెడుతున్న యూనివర్సిటీ పాలకులు.. తమ సొంత లగ్జరీ సౌకర్యాలకు మాత్రం నిధులను నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. యూనివర్సిటీలో పలు కోర్సుల్లో సీటు వచ్చినా.. వసతి గృహాలు, మౌలిక సదుపాయాలు లేక వందలాది మంది విద్యార్థులు రద్దు చేసుకుని వెళ్లిపోతుంటే.. ఇవేమీ పట్టని పాలనా యంత్రాంగం రూ.లక్షలు వెచ్చించి కొత్త లగ్జరీ కార్లు కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారింది.

వీసీ మారినప్పుడల్లా..

యూనివర్సిటీ నిబంధనల ప్రకారం వైస్‌ చాన్స్‌లర్‌ మూడేళ్లు, రిజిస్ట్రార్లు రెండేళ్ల పదవీ కాలానికి నియమితులవుతారు. పాలమూరు యూనివర్సిటీలో వీసీలు మారిన ప్రతిసారి కొత్త లగ్జరీ కారు కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. 2019కి ముందు వీసీ భాగ్యనారాయణ కాలంలో ఇన్నోవా వాహనం ఉండేది. ఆ తర్వాత వీసీగా వచ్చిన రాజారత్నం ఈ వాహనాన్ని రిజిస్ట్రార్‌కు కేటాయించి.. రూ.30 లక్షల వ్యయంతో ఇన్నోవా హై 2.5జెడ్‌ కొనుగోలు చేశారు. ఈ కారు ఉండగానే.. 2023లో వీసీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ రూ.20 లక్షల వ్యయంతో కొత్తగా మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీ వాహనం కొనుగోలు చేశారు. ఈ రెండు వాహనాలను వినియోగించుకునే అవకాశం ఉన్నా.. తాజాగా వీసీ శ్రీనివాస్‌ ఇటీవల సుమారు రూ.32 లక్షల వ్యయంతో మహీంద్రా ఈవీ (లేటెస్ట్‌ మోడల్‌) కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇద్దరు ఉన్నతాధికారులు వినియోగించుకునేందుకు వర్సిటీలో ఏకంగా నాలుగు కార్లు అందుబాటులో ఉండడం గమనార్హం.

ఒకటి రోడ్డెక్కితే.. మరొకటి షెడ్డుకే పరిమితం

ప్రస్తుతం వీసీ శ్రీనివాస్‌ ఇన్నోవా హై 2.5జెడ్‌, మహీంద్రా ఈవీ కారును వాడుతుండగా, రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు పాత ఇన్నోవాను పక్కనబెట్టి లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ కొనుగోలు చేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీని వినియోగిస్తున్నారు. కేవలం ఇద్దరు అధికారులు తిరిగేందుకు నాలుగు వాహనాలు ఉండగా.. ఒకటి రోడ్డెక్కితే ఇంకోటి షెడ్డుకే పరిమితమయ్యే పరిస్థితి ఉంది.

మూడేళ్లు, ఆరేళ్లకే మరమ్మతులట..!

విద్యార్థులకు వసతులు కల్పించకుండా, అవసరానికి మించి లగ్జరీ కార్లు కొనుగోలు చేయడంపై పీయూ రిజిస్ట్రార్‌ రమేష్‌బాబును ‘సాక్షి’ సంప్రదించగా.. ‘గతంలో కొనుగోలు చేసిన పాత కార్లు తరచుగా మరమ్మతుకు రావడంతో కొత్త కారు కొన్నాం. ప్రతి నెలా పెట్రోల్‌ కార్లు వినియోగించడం వల్ల ఎక్కువ మొత్తంలో ఖర్చవుతోంది. దీంతో ఎలక్ట్రిక్‌ కార్లు కొనుగోలు చేశాం. వీటి వల్ల ఇంధన ఖర్చులు తగ్గి దీర్ఘకాలంలో యూనివర్సిటీకి నిధులు ఆదా అవుతాయి.’ అని సమాధానం ఇచ్చారు. మూడేళ్లకు, ఆరేళ్ల్లకే మరమ్మతులు రావడం ఏమిటని ప్రశ్నిస్తే సమాధానం కరువైంది.

విద్యార్థి సంఘాల ఆగ్రహం..

గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థులకు యూనివర్సిటీలో సరిపడా హాస్టల్‌ గదులు లేవని.. తాగడానికి మంచి నీరు, చదువుకోవడానికి లైబ్రరీలో ఆధునిక పుస్తకాలు, ల్యాబ్‌ సౌకర్యాలు లేవని.. విద్యార్థుల కష్టాలు పట్టని అధికారులకు ఈ లగ్జరీ కార్ల మోజు ఎందుకని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ నిధుల దుర్వినియోగమేనని.. సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని.. లేకుంటే యూనివర్సిటీ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నారు.

పాలమూరు యూనివర్సిటీలో లగ్జరీ పాలన

వీసీలు మారిన ప్రతీసారి నూతన వాహనం కొనుగోలు

సరిపోను వసతి లేక సీట్లు రద్దు చేసుకుని వెళ్తున్న విద్యార్థులు

ఇవేమీ పట్టకుండా యథేచ్ఛగా నిధుల దుర్వినియోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement