అచ్చంపేట/ ఆత్మకూర్: ఎగువనున్న జూరాల జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం జలాశయానికి 7,134 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జలాశయంలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 875.70 అడుగుల వద్ద 166.7052 టీఎంసీల నీటిమట్టం ఉంది. అయితే ఆదివారం 168.2670 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. విద్యుదుత్పత్తి, సాగు, తాగునీటి అవసరాలకు వదులుతుండటంతో 2 టీఎంసీల మేర తగ్గింది. కుడిగట్టు కేంద్రంలో లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు ఐదురోజుల నుంచి విద్యుదుత్పత్తి నిలిపివేయగా.. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. అలాగే శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి రాయలసీమ తాగు, సాగునీటి అవసరాల కోసం హంద్రీ– నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 8 వేల క్యూసెక్కులు ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. అలాగే కేఎల్‌ఐ ద్వారా తెలంగాణ ప్రబుత్వం 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది.
తగ్గిన విద్యుదుత్పత్తి...
ఎగువ నుంచి జూరాలకు వరద ప్రవాహం నిలిచిపోవడంతో సోమవారం కేవలం 2 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువలో ఒక్కొక్క యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతూ 7,134 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.


