గద్వాల: ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమాభివృద్ధి పథకాలు అర్హులందరికీ దక్కేలా, అన్నిరకాల అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా ప్రత్యేకాధికారి శృతిఓజా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్‌తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం 10 థీములతో షెడ్యూల్ ప్రకారం ఆయా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయన్నారు. వివిధ శాఖల్లో గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలన్నారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా మరుగుదొడ్లు, అమ్మ ఆదర్శ పాఠశాలలో మరమ్మతు, గట్టు మండలం ఆస్పిరేషనల్ బ్లాక్‌కు ఎంపిక కావడం, నిర్దేశిత పారామీటర్స్‌లో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించడం జరిగిందన్నారు. బాల్యవివాహాలు అరికట్టేలా కృషి చేశామన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో అరైవ్, అలైవ్ వారోత్సవాలు నిర్వహించి రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల వివరాలతో రూపొందించిన పుస్తకాలను విడుదల చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.


