గద్వాల న్యూటౌన్: వీధి వ్యాపారుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మున్సిపల్ చైర్‌పర్సన్ జయలక్ష్మి అన్నారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో మెప్మా ఆధ్వర్యంలో స్వానిధి మహోత్సవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వీధి వ్యాపారాలు కనీస పెట్టుబడికి ఆర్థికపరమైన ఇబ్బందులు పడకుండా బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందిస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గద్వాల పట్టణంలో వీధి వ్యాపారులు తమ వ్యాపారాలు నిర్వహించుకోవడంలో వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ కమిషనర్ జానకిరాం సాగర్ మాట్లాడుతూ 2019లో కరోనా వ్యాధి సమయంలో చిరు, వీధి వ్యాపారులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడ్డారని, వారికి ఆర్థికపరమైన చేయూతను అందించేందుకు అప్పుడు ప్రభుత్వం భారత్ ఆత్మ నిర్భర్ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ పథకం కింద బ్యాంకుల ద్వారా మూడు విడతలుగా రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.50 వేలు రుణాలు అందించామని గుర్తుచేశారు. ఈ రుణ మొత్తాలను ఇటీవల కొంత పెంచారని, వీధి వ్యాపారులు అధిక వడ్డీలకు ప్రైవేట్‌గా అప్పులు తీసుకోకుండా, వీధి వ్యాపారిగా నమోదై బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఉత్తమ వీధి వ్యాపారులుగా ఎంపికై న వారిని చైర్‌పర్సన్, కమిషనర్ శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. అంతకు ముందు ఆవరణలో ఏర్పాటు చేసిన ఫుడ్, వస్తువుల స్టాల్స్‌ను సందర్శించారు. కార్యక్రమంలో మెప్మా ఏడీఎంసీ వెంకటేశ్వర్లు, సీఓలు నిజాముద్దీన్, మహాలక్ష్మి, తిమ్మన్న తదితరులు పాల్గొన్నారు.


