గద్వాల: యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు అన్నారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోదక దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్‌కు పునాది అని, యువత డ్రగ్స్‌కు అలవాటు పడితే వారి వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా భవిష్యత్, కుటుంబం మొత్తం నాశనమవుతుందన్నారు. అంతేకాకుండా సమాజానికి సైతం నష్టం కలిగిస్తుందన్నారు. విద్యార్థులు చెడు స్నేహాలు, ఆకర్షణలకు లోనుకాకుండా విద్యపై దృష్టి కేంద్రీకరించాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం వంటివి చేస్తే చట్టపరంగా కఠిన శిక్షలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, లక్ష్మణస్వామి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.


