గద్వాల (మల్దకల్): పంటల సాగులో రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జగ్గునాయక్ అన్నారు. గురువారం మండలంలోని పెద్దపల్లి గ్రామంలో ఏఓ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు కంపెనీ గుర్తింపు కలిగిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, నానో యూరియా, నానోడీ డీఏపీల వాడకం పెంచాలని వివరించారు. ముఖ్యంగా జీవ ఎరువుల ప్రాముఖ్యత, జీవామృతం, వర్మీ కంపోస్టు, బయో ఫర్టిలైజర్ల వినియోగం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడి పంటల దిగుబడి పెరుగుతుందన్నారు. రైతులు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించి.. పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులు వాడితేనే మంచి దిగుబడులు పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచు శిరీష, ఏఈఓ సుధారాణి, రైతులు పాల్గొన్నారు.


