సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ సబ్జెక్ట్‌లకు సంబంధించి ఉపాధ్యాయుల కొరతను అధిగమించేలా సర్కారు చర్యలకు ఉపక్రమించింది. ఆయా స్కూళ్లలో మిగులు (సర్‌ప్లస్) ఉన్న ఉపాధ్యాయులను కొరత ఉన్న చోట్ల సర్దుబాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది 20 నాటికి ప్రభుత్వ బడుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య.. 2021లో జారీ చేసిన జీఓ నంబర్ 25 ఆధారంగా సర్దుబాటు చేపట్టేలా మార్గదర్శకాలు విడుదల చేసింది. కేవలం ఆయా జిల్లాల పరిధిలో కలెక్టర్ల (చైర్మన్లు) అనుమతితో మాత్రమే డిప్యూటేషన్ల తంతు చేపట్టనున్నారు.
సుమారు 650 మందికి..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2,225 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ఇందులో 1.90 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటివరకు జీరో ఎన్‌రోల్‌మెంట్ కారణంగా మూతపడిన సర్కారు పాఠశాలలు 135 ఉన్నాయి. సర్దుబాటులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 650 మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్లపై ఆయా పాఠశాలల్లో సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి. జూనియర్లను సర్దుబాటుపై బదిలీ చేయాలని.. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ విరమణకు దగ్గర ఉన్న ఉపాధ్యాయులకు సర్దుబాటు నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.
పలు సబ్జెక్ట్ టీచర్ల కొరతే అసలు సమస్య..
ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందడం, బదిలీలు, పదోన్నతుల మూలంగా చాలా హైస్కూళ్లలో పలు సబ్జెక్ట్‌లను బోధించే ఉపాధ్యాయుల కొరత వేధిస్త్తోంది. ప్రాథమిక (ప్రైమరీ) పాఠశాలల్లో అన్ని సబ్జెక్ట్‌లను ఒకే ఉపాధ్యాయుడు బోధించే వెసులుబాటు ఉన్నప్పటికీ.. ఉన్నత (హైస్కూల్) పాఠశాలల స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం 130 పాథమిక పాఠశాలలు మూతపడగా.. ఆయా ఉపాధ్యాయులను అవసరం ఉన్న చోట హైస్కూళ్లకు బదిలీ చేస్తున్నారు. అయితే ఇంగ్లిష్, హిందీ, తెలుగు వంటి లాంగ్వేజెస్ బోధించే ఉపాధ్యాయుల కొరత పీడిస్తోంది. దీంతో చాలా పాఠశాలల్లో అనివార్యంగా ఆయా సబ్జెక్ట్‌లను బోధిస్తున్న టీచర్లతోపాటు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కొన్నేళ్లుగా రెగ్యులర్ నియామకాలు చేపట్టకపోవడంతో అధిక సంఖ్యలో ఖాళీలు ఏర్పడగా.. హైస్కూళ్లలో సమస్యగా మారింది.
శాశ్వత పరిష్కారం చూపించాలి..
ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం.. కొన్నింటిలో తగ్గడం వంటి కారణాల చేత సర్దుబాటు చేయడం తప్పని సరిగా మారింది. అయితే ప్రతి సంవత్సరం సర్దుబాటు చేస్తున్న పలు పాఠశాలలు మూతబడుతున్నాయని, హైస్కూల్ స్థాయిలో సబ్జెక్ట్‌లు బోధించే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోందని.. శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
జోగుళాంబ గద్వాల 10
నాగర్‌కర్నూల్ 0
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లకు డిప్యూటేషన్లు
ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకే అవకాశం..
జిల్లా పరిధిలో కలెక్టర్ల అనుమతితో మాత్రమే తాత్కాలిక బదిలీ
జీరో ఎన్‌రోల్‌మెంట్ పాఠశాలలు ఈ సారి ఒక్కటీ తెరుచుకోనట్లే..
ఉమ్మడి జిల్లాలో ప్రశ్నార్థకంగా 135 స్కూళ్ల భవితవ్యం
ప్రశ్నార్థకంగా 135 స్కూళ్లు..
ఉమ్మడి జిల్లాలో జీరో ఎన్‌రోల్‌మెంట్ పాఠశాలలకు సంబంధించి గత సంవత్సరం డిప్యూటేషన్‌పై వేరే పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులు ఈ విద్యాసంవత్సరంలో తిరిగి ఆయా స్కూళ్లకు రాలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో ఈ సంవత్సరం ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు. బడిబాట కార్యక్రమం నిర్వహించి ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా.. ఆయా ఉపాధ్యాయులు, ఎంఈఓలు దృష్టి పెట్టకపోవడంతో 135 పాఠశాలల్లో ఒక్కటి కూడా తిరిగి తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయా స్కూళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.


