గద్వాల క్రైం: నిషేధిత మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం గద్వాల మండలంలోని అనంపురం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. యువత, చిన్నారులు, పెద్దలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారన్నారు. ఈ అలవాటు కుటుంబ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని చెప్పారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు రవాణా చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు శాఖకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ నిత్య, సీఐ శ్రీను, ఎస్‌ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.
గద్వాల జిల్లా జడ్జిగా కల్యాణ్ చక్రవర్తి
పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తిగా పని చేసిన కల్యాణ్ చక్రవర్తి జోగుళాంబ గద్వాల జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై బదిలీ అయ్యారు. జిల్లాలో దీర్ఘకాలికంగా పని చేసి గద్వాలకు బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తిని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత హాజరై సత్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు, కార్యదర్శి నర్సింహారెడ్డి, వెంకటయ్య, చంద్ర మౌలి, అనంతరెడ్డి, అనిల్‌కుమార్, ఎన్‌పీ వెంకటేష్, స్వదేష్, న్యాయవాదులు పాల్గొన్నారు.
రంగారెడ్డిగూడలో
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్
రాజాపూర్: జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడెం గ్రామంలో రూ.12 కోట్లతో నాలుగు ఎకరాల స్థలంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను ఈనెల 25న మంత్రి వివేక్ వెంకట్‌స్వామి ప్రారంభించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దూసుకుపోతున్న ఈ కంప్యూటర్ యుగంలోయువతకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను రంగారెడ్డిగూడలో ప్రారంభించుకోవడం ఎంతో శుభపరిణామమన్నారు. గ్రామశివారులో ఎస్సీ కాలనీ పక్కన టాటా కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఈ కేంద్రం కార్యరూపం దాల్చబోతోందని పేర్కొన్నారు. ఇప్పటికే బాలానగర్ మండలం పెద్దాయపల్లి వద్ద యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌తో పాటు నవోదయ పాఠశాలను మంజూరు చేయించామని, జడ్చర్ల మండలం చిట్టెబోయిన్‌పల్లి వద్ద ట్రిపుల్ ఐటీ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
612 క్వింటాళ్ల
వేరుశనగ రాక
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవ సాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 612 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.7,819, కని ష్టంగా రూ.3,549, సరాసరిగా రూ.5,700 ధరలు లభించాయి. అలాగే 5 క్వింటాళ్ల వరి (సోన) క్వింటాల్ రూ.2,567ధర పలికింది.
జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్‌లో మంగళవారం క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,626, కనిష్టంగా రూ.2,001 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,222, కనిష్టంగా రూ.2,177 ధరలు పలికాయి.


