ఎర్రవల్లి: ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తేనే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. ఎర్రవల్లిలోని పదవ బెటాలియన్ పోలీస్ సెమినార్ హాల్‌లో మంగళవారం జ్ఞానదీప్తి పేరుతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలకు నిర్వహించిన పాఠశాలల ప్రారంభ మార్గదర్శక శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యాశాఖకు సంబంధించిన 32 పారా మీటర్స్‌లో మన జిల్లా మంచి ర్యాంకింగ్ సాధించేలా ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో తమ విధులను నిర్వర్తించాలన్నారు. యూడైస్ అప్‌డేట్ పక్కాగా ఉండాలని, ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఇటీవలే విద్యా శాఖాధికారులతో కలిసి ఆయన ఫిన్లాండ్ దేశంలో పర్యటించి, అక్కడి విద్యా వ్యవస్థను అద్యయనం చేయడం జరిగిందని, కొన్ని అంశాలను మన వద్ద కూడా అమలు చేసి మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎంఈఓలు తమ పరిధిలోని పాఠశాలలను ప్రతినెలా 15లోగా సందర్శించి నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఉపాధ్యాయులు లీవ్ లెటర్ ఇవ్వకుండా పాఠశాలలకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందన్నారు. పోషణ్ యాప్‌లో ఎప్పటికప్పుడు వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. ప్రత్యేక పునశ్చరణ తరగతుల ద్వారా చదువులో వెనకబడిన విద్యార్థులు మెరుగుపడేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పీపీటీ ద్వారా మాస్టర్ ట్రైనర్ అగస్టీన్ వివిధ అంశాలపై ఎంఈఓలు, హెచ్‌ఎంలకు సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్‌కుమార్‌రెడ్డి, రాజ్‌కుమార్, డీఈఓ విజయలక్ష్మి, కమాండెంట్ జయరాజు, అసిస్టెంట్ కమాండెంట్ పాణి,సెక్టోరియల్ అధికారులు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.


