128వ రోజుకు చేరిన నిరసన దీక్షలు | - | Sakshi
Sakshi News home page

128వ రోజుకు చేరిన నిరసన దీక్షలు

Jun 24 2026 1:11 AM | Updated on Jun 24 2026 1:11 AM

గట్టు: మండల పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న భారత్‌మాల రోడ్డుకు మండలానికి కనెక్టివిటీ కల్పించే అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, రాయాపురం స్టేజీ డబుల్‌ రోడ్డును మూసివేయకుండా వంతెన నిర్మాణం చేపట్టాలని గట్టు, రాయాపురం, ఆలూరు, తుమ్మలచెరువు గ్రామస్తులు నిరసన దీక్షలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు రాముడు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారం నాటికి 128వ రోజుకు చేరుకుంది. రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న గట్టు మండలంలో భారత్‌మాల రోడ్డు నిర్మాణం ఈ ప్రాంతవాసులకు కొత్త ఆశలను చిగురింపజేసినట్లు తెలిపారు. అయితే రోడ్డుకు ఇరువైపులా ప్రహరీ నిర్మిస్తుండటం వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. దీంతో మండల ప్రజలు నిరసన దీక్షలకు పూనుకున్నారని చెప్పారు. భారత్‌మాల రోడ్డుకు గట్టు మండలానికి కనెక్టివిటీ ఇచ్చే అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, రాయాపురం స్టేజీ దగ్గరున్న డబుల్‌ రోడ్డును మూసివేసి.. రాకపోకలు లేని పాత ఆలూరు రోడ్డు మార్గంలో వంతెనను తక్కువ ఎత్తులో నిర్మించడం ద్వారా భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందన్నారు. దీనికి తోడు రోడ్డు మలుపు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. జాతీయ రహదారి నిర్మాణ సంస్థ, కాంట్రాక్టర్‌, కేంద్ర ప్రభుత్వం స్పందించి గట్టు మండలానికి కనెక్టివిటీ ఇవ్వడంతోపాటు నూతనంగా వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మహదేవప్ప, అమ్మన్న, వీరేష్‌, వెంకటన్న, తిమ్మప్ప, కృష్ణయ్య, సాలెకర్రెప్ప, జనార్దన్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement