నేరాలకు ఒడిగడుతున్న మైనర్లు
–8లో u
గద్వాల క్రైం: తెలిసి తెలియని యుక్త వయస్సు.. స్మార్ట్‌ఫోన్లు, ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్, డ్రగ్స్‌కు బానిసలై కొందరు మైనర్లు దారి తప్పుతున్నారు. బాల్యంలోనే దురలవాట్లు, దొంగతనాలు, హింసాత్మక ఘటనలకు పాల్పడి బాల నేరస్తులుగా పోలీసుల రికార్డులోకి ఎక్కుతున్నారు. బంగారు భవిష్యత్ ఉన్న చిన్నారులు జోగుళాంబ గద్వాల జిల్లాలో మద్యం, గంజాయి, అత్యాచారాలు, పొగ తాగడం వంటి జల్సాలకు అలవాటు పడుతున్నారు. ఇటీవల ఓ దొంగతనం కేసులో పట్టుబడిన మైనర్ బాలుడిని పోలీసులు జువైనల్ స్టేట్ హోంకు తరలించారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
చేజారి పోతున్నారు..
జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని పలువురు మైనర్లు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. కొందరు మద్యానికి మరి కొందరు పొగతాగడం, గంజాయి పీలుస్తున్నారు. వ్యసనాలకు డబ్బులు లేకపోవడంతో దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్లకు బానిసలై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అశ్లీల వీడియోలను చూస్తూ విచక్షణ కోల్పోయి రోడ్డుపై వెళ్తున్న మహిళల్ని వేధిస్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయి. కాలనీల్లోని ఇతర మైనర్లతో దురుసుగా వ్యవహరించడం వంటి ఘటనలు ఉన్నాయి. పిల్లల నడవడిక విషయంలో తల్లిదండ్రులు నిత్యం గమనించాలి. స్నేహితుల్లో చెడు వ్యసనాలు కలిగిన ఒక్కరున్నా వారి ప్రభావం ఇతర చిన్నారులపై పడుతుంది. గంజాయి కేసులు సైతం నమోదయ్యాయి. వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి చెడు వ్యసనాల నుంచి విముక్తి కల్పించేలా కృషి చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు కొన్నాళ్లకు మళ్లీ అదే దారిలోకి వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
డబ్బుల కోసం దొంగతనాలు
అత్యాచార కేసుల్లోనూ నిందితులుగా..
గంజాయి, డ్రగ్స్ కోరల్లో
చిక్కుతున్న వైనం
తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం
ఓ కారణమే..
జిల్లా కేంద్రానికి చెందిన ఓ మైనర్ బాలుడు జల్సాలకు అలవాటు పడి, దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. నూతన గృహా నిర్మాణాలకు యజమానులు తెచ్చిన విలువైన విద్యుత్ వైర్లను అపహరించి వాటిని బయటి మార్కెట్‌లో తక్కువ ధరకు విక్రయించగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో 2025 లో దొంగతనం చేస్తూ కాలనీవాసులకు పట్టుబడగా.. వారు పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించిన క్రమంలో మైనర్ బాలుడు తండ్రి ఓ పోలీసు కావడంతో మందలించి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. ఇతడితో పాటు మరికొంత మంది మైనర్లు ఉండడం కొసమెరుపు.
జూన్ 10, 2026లో చేనుగోనిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు, నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే పోలీసులు ఇద్దరిని అరెస్టు చేయగా.. అందులో ఒకరు మైనర్‌గా ఉన్నాడు. దీంతో పోలీసులు బాల నేరస్తుడిని జువైనల్ స్టేట్ హోంకు తరలించారు. అతడు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న క్రమంలో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇదే తరహాలో వారం రోజుల క్రితం ఓ మైనర్ బాలుడు పట్టణ శివారుల్లోని చిరు దుకాణంలో చోరీలకు పాల్పడ్డాడు. కాలనీవాసులు గుర్తించి పోలీసులకు అప్పగించారు.
2025లో జిల్లా కేంద్రానికి చెందిన కొందరు గుర్తుతెలియని యువకులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పలు ద్విచక్ర వాహనలను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు ముమ్మరంగా గాలించిన పోలీసులు చోరీలకు పాల్పడిన 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లుగా పోలీసులు గుర్తించారు. మరి కొందరు గంజాయికి అలవాటు పడ్డారు. నెల క్రితం ఓ మైనర్ బాలుడు అత్యాచార కేసులో పోలీసులకు పట్టుబడగా.. పోలీసులు జువైనల్ స్టేట్ హోంకు తరలించారు. ఏడాది కాలంగా జిల్లాలో 20 మందికి పైగా మైనర్లు వివిధ కేసుల్లో పాలుపంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది.


