గద్వాల క్రైం: లోక్ అదాలత్‌లో వివాదాలను పరిష్కరించుకుంటే కక్షిదారుల్లో సోదరభావం పెంపొందడంతోపాటు సమయం, డబ్బు ఆదా అవుతుందని జిల్లా కోర్టు న్యాయమూర్తి రవికుమార్ అన్నారు. సుప్రీంకోర్టు అదేశాల మేరకు శనివారం గద్వాల కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించామని న్యాయమూర్తి తెలిపారు. ఏళ్ల తరబడి కేసులు పరిష్కారం చేసుకోకుంటే ప్రయోజనం లేదన్నారు. ప్రస్తుత సాంకేతిక విప్లవంలోనూ కేసుల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఇరువర్గాలకు చెందిన కక్షిదారులు తమ విలువైన భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కేసుల నుంచి విముక్తి పొందే దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్‌లో 7,046 కేసులు పరిష్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. క్రిమినల్, సివిల్, సైబర్ క్రైం, బ్యాంకు లిటిగేషన్, ప్రమాద తదితర పెండింగ్ కేసులలో ఇరువర్గాల వారికి రాజీ కుదిర్చినట్లు వెల్లడించారు.


