గద్వాల క్రైం: జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సమస్యల వల్ల ఎవరూ ఇబ్బందులు పడకుండా సిబ్బంది విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించి మాట్లాడారు. ప్రధాన కూడళ్లలో నిత్యం వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్నారని, ఇలాంటి వారిని ట్రాఫిక్ సిబ్బంది కట్టడి చేయాలన్నారు. జరిమానాలు విధించడంతోపాటు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. మరోవైపు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడిన క్రమంలో వారి తల్లిదండ్రులకు తెలియజేసి కౌన్సిలింగ్‌తోపాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ బాలచంద్రుడు ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టిన చర్యలను ఎస్పీకి వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
993 క్వింటాళ్ల
వేరుశనగ రాక
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 993 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటా గరిష్టంగా రూ.7,599, కనిష్టంగా రూ.3,266, సరాసరిగా రూ.5,499 ధరలు లభించాయి. అలాగే క్వింటా ఆముదాలు రాగా రూ.5,819 ఒకే ధర పలికింది.
జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో
ధరూరు/ రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గినట్లు పీజేపీ అధికారులు చెప్పారు. శనివారం ప్రాజెక్టుకు కేవలం 547 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 1,500 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2 ద్వారా 554 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 2,457 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.316 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
● సుంకేసుల డ్యాం నుంచి ఒక గేటు ద్వారా నీటిని దిగువకు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. శనివారం ఎగువ నుంచి 1,500 క్యూపెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. ఒక గేటను 30 మీటర్ల మేర ఎత్తి 1,140 క్యూసెక్కులను దిగువకు, కేసీ కెనాల్‌కు 1,290 క్యూసెక్కులు వదిలినట్లు ఆయన పేర్కొన్నారు.
చేనేత కార్మికుల
అభ్యున్నతికి తోడ్పడాలి
గద్వాల న్యూటౌన్: జిల్లాలోని చేనేత కార్మికుల అభ్యున్నతికి తోడ్పాటు అందించాలని కౌన్సిలర్ రామలింగేశ్వర్ కాంళ్లే, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ హ్యండ్లూమ్ ఏడీ ఇందిరను కోరారు. పలువురు చేనేత కార్మికులతో కలిసి శనివారం ఆమెను కార్యాలయంలో కలిశారు. చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగించే కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముద్ర రుణాలు అందించాలని విన్నవించారు. అలాగే నూతనంగా మగ్గాలు ఏర్పాటు చేసుకునే వారికి జియో ట్యాగ్ నంబర్లు సకాలంలో అందించాలని, గద్వాల హ్యాండ్లూమ్ పార్క్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. అంతకు ముందు ఏడీని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు వెంకటేష్, జగన్, వీరేష్, రవి, వీరన్న తదితరులు పాల్గొన్నారు.


