మల్దకల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి విద్యాభివృద్ధికి కృషిచేయాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం మల్దకల్‌లోని కేజీబీవీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడంతోపాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను నిరంతరం పర్యవేక్షిస్తూ వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకు పనిచేయండి
అయిజ: వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది నిబంధనల మేరకు పనిచేయాలని, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. మండలంలోని వేణిసోంపురంలో ఈజీఎస్ పనులను పరిశీలించారు. ఈజీఎస్ కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలకు చేరుకొని మధ్యాహ్న భోజనం పరిశీలించారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన కూరగాయల విత్తనాలను సాగుచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకరమ్మ, ఎంపీడీఓ భాస్కర్, ఎంపీఓ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


