నడిగడ్డలో 70శాతం తగ్గిన సీడ్ పత్తి సాగు
గట్టు: రైతుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే సీడ్‌పత్తి సాగు ఈసారి సంకట స్థితిని ఎదుర్కొంటోంది. రెండు, మూడేళ్లుగా పండించిన పత్తి విత్తనాలు కంపెనీల వద్ద పేరుకుపోవడానికి తోడు ఆర్గనైజర్ల కొర్రీల కారణంగా నడిగడ్డ ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఫలితంగా రాష్ట్రంలోనే పేరెన్నిక గల పత్తి విత్తనాలను అందిస్తూ వస్తున్న ఇక్కడి రైతులు చాలామంది పత్తి విత్తనోత్పత్తికి దూరమయ్యారు. గతేడాది సీడ్ పత్తిని 22,783 ఎకరాల్లో సాగుచేయగా.. ఈసారి కేవలం 30శాతం మేర మాత్రమే సాగైందని అధికారు ల అంచనా. కమర్షియల్ పత్తి మాత్రం 1,05,101 ఎకరా ల్లో సాగు అవుతోంది.
నడిగడ్డ నేలలు
అనుకూలం..
జిల్లాలోని ఎత్తు పల్లాలు కలిగిన మెట్ట భూములు సీడ్ పత్తి సాగుకు అనుకూలంగా ఉన్నాయి. జూన్ ప్రారంభంలో సీడ్ పత్తిని సాగు మొదలుపెడతారు. జూలై చివరి వారం నుంచి క్రాసింగ్ పనులు (మగ పువ్వు పుప్పోడిని ఆడ పువ్వుతో క్రాసింగ్) ప్రారంభిస్తారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చే వారు. జిల్లాలో సీడ్ పత్తి సాగు విస్తీర్ణం పడిపోవడంతో కూలీలకు పనుల కొరత నెలకొంది. ఆరు మాసాల్లో చేతికొచ్చే ఎకరా పంట సాగుకు రైతులు రూ.లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెడతారు. విత్తనాల నాణ్యత మేరకు రైతులకు రూ. 2.5లక్షల నుంచి రూ. 4లక్షల వరకు ధర వస్తుంది.
ముందస్తు హెచ్చరికలు.. గతంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది నుంచి సీడ్‌పత్తి రైతులను ఆర్గనైజర్లు హెచ్చరిస్తూ వచ్చారు. ముందుస్తు ఒప్పందం మేరకు జూన్ మొదటి వారంలోనే రైతులకు విత్తనాలతో పాటు పెట్టుబడి కోసం కొంత డబ్బులను అందజేసిన ఆర్గనైజర్లు.. 45 రోజుల తర్వాత ఎకరాకు కేవలం 150 నుంచి 200 పాకెట్లు మాత్రమే కొంటామని.. అంతకన్నా ఎక్కువ తాము కొనలేమని తేల్చిచెప్పారు. సీడ్ పత్తి పంట ఎకరాకు 4 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండగా.. క్వింటన్నర, రెండు క్వింటాళ్లు మాత్రమే కొంటామని ఆర్గనేజర్లు రైతులను హెచ్చరిస్తూ వచ్చారు. పెట్టుబడులను సైతం ఇవ్వడం నిలిపివేయడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు.
కంపెనీల వద్ద పేరుకుపోయిన నిల్వలు
బకాయిపడిన
రైతులకే విత్తనాల సరఫరా
ఈసారి గణనీయంగా
పడిపోయిన సాగు విస్తీర్ణం
ధర సైతం తగ్గింపు..
పత్తి విత్తన కంపెనీల ఆర్గనైజర్లతో గతేడాది జరిగి న ముందస్తు ఒప్పందం మేరకు కేజీ విత్తనాల పాకెట్ ధర రూ.600 ఇవ్వగా.. ఈసారి రూ.500కే కొంటామని చెబుతున్నట్లు తెలిసింది. ప్రతి ఏటా ధరలను పెంచాల్సిందిపోయి.. తగ్గిస్తుండడంతో కొందరు రైతులు సాగుకు ముందుకు రావడంలే దు. మరోవైపు విత్తన కంపెనీలు సీడ్ సాగు పెట్టుబడుల కోసం ఆర్గనైజర్లకు ఇచ్చే డబ్బులను చెల్లించేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఆర్గనైజర్ల వద్ద గతేడాది బకాయిపడిన రైతులకు మాత్రమే కంపెనీల ద్వారా విత్తనాలను అందజేస్తున్నట్లు తె లుస్తోంది. ఈ ఏడాది పండించిన పంటకు సంబంధించిన డబ్బులను రెండేళ్ల తర్వాత తీసుకునేలా అంగీకరిస్తేనే విత్తనాలను రైతులకు అందిస్తున్నట్లు తెలిసింది. ఇలా ఆర్గనైజర్ల కొర్రీలతో రైతులు ఈసారి సీడ్‌పత్తి సాగును 70శాతం మేర తగ్గించేశారు. సీడ్ పత్తి స్థానంలో కమర్షియల్ పత్తితో పాటు ఇతర పంటలపై రైతులు దృష్టిసారించారు.


