జూరాలకు 1,999 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

జూరాలకు 1,999 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Jun 18 2026 12:47 AM | Updated on Jun 18 2026 12:47 AM

ధరూరు/రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు 1,999 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులను రన్‌ చేసి.. రిజర్వాయర్లను నింపుతున్నట్లు పేర్కొన్నారు. నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌–1కు 1,300, ఆవిరి రూపంలో 44 క్యూసెక్కులతో కలిపి మొత్తం 2,844 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.791 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.

● సుంకేసుల డ్యాం వద్ద రెండు గేట్లను ఎత్తారు. ఉదయం ఎగువ నుంచి 7,650 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో రాగా.. ఒక గేటును ఒక మీటర్‌ మేర, మరో గేటును అర మీటర్‌ మేర తెరిచి 6,759 క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు.

పెరిగిన ఉల్లి ధర

దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధర మరింత పెరిగింది. వివిధ గ్రామాల నుంచి దాదాపు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి రాగా.. వ్యాపారులు వేలం వేసి ధరలు నిర్ణయించారు. వేలంలో క్వింటాల్‌ ఉల్లి గరిష్టంగా రూ.2,110, కనిష్టంగా రూ.1,200 వరకు ధరలు లభించాయి. అలాగే 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.1,100, కనిష్టంగా రూ.600 వరకు విక్రయించారు. మార్కెట్‌లో కేవలం ఉల్లి వ్యాపారం మాత్రమే కొనసాగింది.

ఆర్‌ఎన్‌ఆర్‌ @ రూ.2,756

జడ్చర్ల: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌ రకం క్వింటా గరిష్టంగా రూ.2,756, కనిష్టంగా రూ.1,706 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,056, కనిష్టంగా రూ.1,601 చొప్పున పలికాయి.

నేడు లక్కీ డ్రా

కందనూలు: జిల్లాలోని బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతిలో ఎస్సీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు గాను గురువారం లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఉమాపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో ఉదయం 10 గంటలకు డ్రా తీయడం జరుగుతుందని.. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరుకావాలని ఆయన సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement