గట్టు: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం గట్టు మండలం చాగదోన గ్రామంలో వ్యవసాయ గోదాం నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు ఉపాధిహామీ పథకం నిధులు రూ. 30లక్షలతో వ్యవసాయ గోదాం నిర్మిస్తున్నట్లు తెలిపారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించే వరకు వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవచ్చన్నారు. ప్రతి రైతు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం చిన్నోనిపల్లె పునరావాస కేంద్రంలో ఐదుగురు లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ఎమ్మెల్యే హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జంబు రామన్‌గౌడ్, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, సర్పంచులు వీరేశ్, దేవేందర్, ఉపసర్పంచ్ రంగన్న, కార్యదర్శి ఆంజనేయులు, మాజీ సర్పంచ్ శంకరన్న, శివప్ప, హరిశ్చంద్రగౌడ్, నర్సింహులు, వడ్డే హుస్సేని, మునిస్వామి పాల్గొన్నారు.


