ఉండవెల్లి: అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం వంద పడకల ఆస్పత్రిలో డీసీహెచ్‌ఓ రమేశ్‌చంద్ర అధ్యక్షతన జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశానికి అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, డీఎంహెచ్‌ఓ సంధ్యా కిరణ్మయితో పాటు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఆస్పత్రి అభివృద్ధికి సహకరించాలని ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు విన్నవించగా.. ఆరోగ్యశ్రీ పథకం నిధుల నుంచి రూ. 38లక్షలు మంజూరు చేశారని చెప్పారు. ఈ నిధులతో ఎన్‌టీ మెషన్, ఎండోస్కోపీ, మైక్రోస్కోప్ బ్లడ్ బ్యాంక్, డయాలసిస్ కేంద్రం, ఆస్పత్రి ప్రహారి నిర్మాణం, ప్రత్యేక డ్రెయినేజీ వ్యవస్థ, మిషన్ భగీరథ నీటి సౌకర్యం, ఇన్వర్టర్లు తదితర వాటిని ఏర్పాటుచేయాలని వైద్యాధికారులకు సూచించారు. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా వైద్యం కోసం పక్క రాష్ట్రానికి వెళ్తున్నారని.. ఇక్కడే మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు మాట్లాడుతూ.. వంద పకడల ఆస్పత్రిలో అన్నిరకాల వైద్యసేవలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రి శుభ్రతపై పలు సూచనలు చేశారు. అనంతరం ఆస్పత్రి గదులను పరిశీలించడంతో పాటు ఆవరణలో మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్మన్ జయరాములు, ఆస్పత్రి డీఈ శ్రీనివాసులు, ఎంపీడీఓ తిరుపతన్న, సర్పంచ్ సునీత, కలుగోట్ల పీఏసీఎస్ చైర్మన్ గజేందర్‌రెడ్డి ఉన్నారు.


