మానవపాడు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా అధ్యాపకులు పనిచేయాలని డీఐఈఓ హృదయరాజు సూచించారు. మానవపాడు శ్రీగంగు వెంకటకృష్ణారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరును పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ కళాశాలల బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ విద్యా సంవత్సరం 15 నుంచి 25శాతం అడ్మిషన్లు పెరిగేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థుల హాజరు 80, 95శాతం ఉండేలా చూడాలన్నారు. తరగతి గదిలో ఫోన్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలన్నారు. మెరిట్ విద్యార్థులకు ఎన్‌ఈఈటీ, ఐఐటీ, సీఎల్‌ఏటీ, సీఏ ఫౌండేషన్ వంటి జాతీయస్థాయి పోటి పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించాలని.. పరీక్షల్లో ప్రతిభకనబరిచిన వారిని మరింత ప్రోత్సహించాలన్నారు. అడ్మిషన్లు పూర్తయిన వెంటనే కేర్ టేకర్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని.. గైర్హాజరయ్యే విద్యార్థుల వివరాలను తల్లిదండ్రులకు వెంటనే చేరవేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రిన్సిపాల్ పద్మావతి తదితరులు ఉన్నారు.


