పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

గద్వాల: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ రూపకల్పన ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో గద్వాల రూరల్‌, అర్బన్‌ బీఎల్‌ఓలు బీఎల్‌ఏలు, సూపర్‌వైజర్లకు ఓటరు జబితా రూపకల్పనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదర్శకంగా ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ హరికృష్ణ, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

నెట్టెంపాడుకు నీటి పంపింగ్‌

ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ఎగువన కురిసిన వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు మంగళవారం సాయంత్రం వరకు 3,052 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులను రన్‌ చేసి రిజర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 1,300 క్యూసెక్కులు వదలగా.. మరో 44 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.864 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

దివ్యాంగులకు ఆ పార్టీలు చేసిందేమీ లేదు

కొల్లాపూర్‌: దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య వెల్లడించారు. మంగళవారం కొల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అనర్హులకు పింఛన్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందని, దాని తర్వాత పింఛన్లను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్‌ త్వరలోనే రాబోతుందన్నారు. దివ్యాంగులకు పింఛన్లు ఇచ్చే పథకాన్ని మొదట ప్రారంభించింది.. దివ్యాంగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేసింది కాంగ్రెస్‌ పార్టీనే అని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు దివ్యాంగులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో దివ్యాంగులకు స్థానం కల్పించాలని, 5 శాతం ఇళ్లు దివ్యాంగులకు కేటాయించాలని, కొల్లాపూర్‌ మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో రిజర్వేషన్‌ ప్రాతిపదికన దుకాణాలు కేటాయించేలా చూడాలని స్థానిక దివ్యాంగుల సంఘం నాయకులు వీరయ్యకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ రహీంపాష మాట్లాడుతూ మున్సిపల్‌ దుకాణాల్లో దివ్యాంగులకు కూడా ప్రత్యేక కోటా కల్పించేందుకు పాలకవర్గ సభ్యులతో చర్చించి తీర్మానం చేస్తామన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నాయకులు హరీష్‌కుమార్‌, రాజేందర్‌, ఆశన్న, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement