ఎర్రవల్లి: విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె మండలంలోని తిమ్మాపురం, పదో బెటాలియన్, ఎర్రవల్లి, కొండేరు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్య, పరిపాలన, మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును పరిశీలించారు. వంటశాలలు, ఆహార నిల్వలు, వంట సామగ్రి, పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేశారు. అలాగే ఆయా పాఠశాలల్లో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు అందజేశారు. అనంతరం ఎంఈఓ కార్యాలయాన్ని సందర్శించి విద్యా కార్యక్రమాల అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం అందిస్తున్న సౌకర్యాలను సకాలంలో విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు పూర్తిస్థాయిలో పంపిణీ చేసి, ప్రతి విద్యార్థి విద్యాభ్యాసానికి అవసరమైన వనరులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల హాజరు, అభ్యాస ఫలితాల మెరుగుదలపై నిరంతరం దృష్టిసారించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ అమీర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.


