మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తులు అమావాస్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, అమరవాయి చింతలాముని నల్లారెడ్డిస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఆలయాల ఆవరణలో భక్తులకు అన్నదానం చేయడంతోపాటు ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, నాయకులు సీతరామిరెడ్డి, చంద్రశేఖర్‌రావు, వీరారెడ్డి, రాముడు తదితరులు పాల్గొన్నారు.
సుంకేసులకు 7 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
రాజోళి: సుంకేసుల డ్యాంకు ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. సోమవారం ఎగువ నుంచి వచ్చిన నీటితో డ్యాం అధికారులు, సామర్థ్యం మేర నీరు ఉంచుకుని మిగతా నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలో ఎగువ నుంచి 7,650 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో రాగా.. ఒక గేటును మీటరు మేర, మరో గేటును అర మీటర్ మేర తెరిచి 6,759 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు.
పీయూ డిగ్రీ
ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ సెమిస్టర్‌లలో చదువుతున్న విద్యార్థుల డిగ్రీ ఫలితాలను వీసీ జీఎన్ శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. డిగ్రీ రెండో సెమిస్టర్‌లో 36.24 శాతం మంది ఉత్తీర్ణతను సాధించగా, నాలుగో సెమిస్టర్‌లో 44.09, ఐదో సెమిస్టర్‌లో 66.97, ఆరో సెమిస్టర్‌లో 60.83 మంది ఉత్తీర్ణతను పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ ఫలితాలను పీయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అనురాధారెడ్డి, అరుంధతిరెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం
లింగాల: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శివాజీ అన్నారు. సోమవారం లింగాల సమీపంలో కొల్లాపూర్ వెళ్లే మార్గంలో నూతనంగా ప్రారంభించిన సోలార్ ప్లాంట్‌ను ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. మారుమూల ప్రాంతంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వలన ఈ ప్రాంత వినియోగదారులకు ఇక విద్యుత్ సమస్య ఉండదన్నారు. ఈ ప్లాంట్‌ను మండలంలోని మగ్తూంపూర్, అంబట్‌పల్లి సబ్‌స్టేషన్లకు అనుసంధానం చేయడం జరిగిందని డైరెక్టర్ తెలిపారు. సాంకేతిక లోపాలు ఏర్పడితే తప్పా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్లాంట్ సామర్థ్యం, నిర్వహణ తదితర వివరాలను ఆయన తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ ఆపరేషన్ నర్సింహారెడ్డి, డీఈ ఆపరేషన్ శ్రీధర్‌శెట్టి, డీఈ రవి, ఎస్‌ఏఓ పార్థసారథి, ఆంజనేయులు, ఏఈ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.


