అలంపూర్: వేసవి ఆటలకు సెలవు పలికిన చిన్నారులు.. పుస్తకాల బ్యాగులతో బడిబాట పట్టారు. జిల్లాలో నూతన 2026– 27 విద్యా సంవత్సరం సోమవారం వైభవంగా ప్రారంభమైంది. మొదటిరోజు పాఠశాలలకు హాజరైన విద్యార్థులు వేసవి ముచ్చట్లతో కాలక్షేపం చేశారు. చాలారోజుల తర్వాత విద్యార్థుల ఆటవిడుపులతో పాఠశాలల ప్రాంగణాలు పులకించిపోయాయి. ఒకవైపు విద్యార్థుల సందడి.. మరోవైపు ఉపాధ్యాయులు, అధికారులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలల్లో మొదట చేపట్టాల్సిన కార్యక్రమాలు నిర్వహించారు. అలంపూర్ ఎంఈఓ అశోక్‌కుమార్ పునఃప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం తరపున ఉచిత పుస్తకాలే అందజేశారు.
జిల్లా పరిధిలో ఇలా..
జిల్లాలో తొలిరోజు 12 వేల మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 469, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు 178 కలిపి మొత్తం 647 విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 42,300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో మొదటిరోజు పాఠశాలలకు 12 వేల మంది విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
జిల్లావ్యాప్తంగా
పునఃప్రారంభమైన పాఠశాలలు
జిల్లాలో తొలిరోజు
12 వేల మంది విద్యార్థుల హాజరు
చిన్నారులకు పాఠ్య,
నోట్ పుస్తకాల అందజేత


